అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ శనివారం తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళ్లారు. సోమవారం ఆయన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కానున్నారు. ఆ భేటీలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణే ధ్యేయంగా ఇద్దరు నేతలు చర్చలు జరుపనున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంతకు ముందు పాకిస్థాన్‌పై బహిరంగ విమర్శలు చేశారు. పాక్... అమెరికాకు అబద్ధాలు చెప్పి, మోసానికి పాల్పడింది తప్ప ఏ మేలు చేయలేదని ఆరోపించారు. పాక్‌కు అందిస్తున్న సైనిక సహాయాన్ని నిలిపివేశారు. ఉగ్రవాద నిర్మూలనకు మరింత కృషిచేయాలని హెచ్చరించారు. ఈ కారణంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్ అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఘనస్వాగతం..
పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో పాటు ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా, ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫయేజ్ హమీద్ కూడా మూడు రోజుల అమెరికా పర్యటన కోసం వెళ్లారు. వీరంతా ఖతార్ ఎయిర్వేస్కి చెందిన ఓ వాణిజ్య విమానంలో అమెరికాకు చేరుకున్నారు. ఇమ్రాన్‌ఖాన్‌కు.. విదేశాంగమంత్రి షా మొహమూద్ ఖురేషీతో పాటు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకున్న పాకిస్థానీ అమెరికన్లు స్వాగతం పలికారు.
ప్రభుత్వ ఖర్చులు తగ్గించే అంశంలో భాగంగా ఇమ్రాన్‌ఖాన్ పాకిస్థాన్ రాయబారి అసద్ మజీద్‌ఖాన్ అధికారిక నివాసంలో బస చేస్తారు.
ట్రంప్‌తో భేటీ..
సోమవారం శ్వేతసౌధంలో అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగే సమావేశంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నారు ఇమ్రాన్.