తెలంగాణ

telangana

ETV Bharat / international

యుద్ధ వాతావరణం వేళ.. రష్యాలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పర్యటన..!

Pak PM Visit To Russia: రష్యా, ఉక్రెయిన్ సరిహద్దులో యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ పాకిస్థాన్‌ ప్రధానమంత్రి రష్యా పర్యటన చేపట్టారు. పుతిన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించడంపై ఇమ్రాన్‌ ఖాన్‌ చర్చలు జరుపనున్నారు.

Pak PM Imran Khan leaves for Russia on maiden visit aims to reset bilateral ties
యుద్ధ వాతావరణం వేళ.. రష్యాలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పర్యటన..!

By

Published : Feb 24, 2022, 5:53 AM IST

Pak PM Visit To Russia: రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ.. పాకిస్థాన్‌ ప్రధానమంత్రి రష్యాలో కీలక పర్యటన చేపట్టారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మాస్కోకు బయలు దేరారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించడంపై ఇమ్రాన్‌ ఖాన్‌ చర్చలు జరుపనున్నారు. అయితే, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తోపాటు ఇతర దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్న వేళ పాక్‌ ప్రధాని రష్యా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక రెండు దశాబ్దాల తర్వాత ఓ పాకిస్థాన్‌ ముఖ్యనేత రష్యాలో పర్యటించడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం.

రెండురోజుల రష్యా పర్యటనలో భాగంగా అధ్యక్షుడు పుతిన్‌తో ఇమ్రాన్‌ ఖాన్‌ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించడం, ఇంధన రంగంలో సహకారాన్ని విస్తరించే అంశాలపై చర్చలు జరుపనున్నారు. వీటితోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు సహా అఫ్గానిస్థాన్‌ పరిస్థితులపైనా విస్తృతంగా చర్చిస్తారని పాక్‌ విదేశాంగశాఖ కార్యాలయం వెల్లడించింది.

అయితే, రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలోనే పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా అఫ్గాన్‌ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత మిలటరీ బేస్‌లను అమెరికాకు ఇచ్చేందుకు పాకిస్థాన్‌ నిరాకరించింది. అంతేకాకుండా జో బైడెన్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫోన్‌లోనూ మాట్లాడేందుకు పాక్‌ ప్రధాని అందుబాటులోకి రాలేదు. దీంతో తన మద్దతు రష్యాకే ఉంటుందని అమెరికాకు సంకేతాలు పంపించేందుకు ఈ పర్యటనను పాక్‌ ప్రధాని ఉపయోగించుకోనున్నట్లు తెలుస్తోంది.

రష్యా పర్యటనలో పాకిస్థాన్‌ ప్రధానితోపాటు విదేశాంగశాఖ మంత్రి షా మహమ్మూద్‌ ఖురేషీ, ఐటీశాఖ మంత్రి ఫవాద్‌ ఛౌద్రీ, ప్రణాళిక శాఖ మంత్రి అసద్‌ ఉమర్‌తో పాటు ఆర్థిక సలహాదారు అబ్దుల్‌ రజాక్‌ దావూద్‌, జాతీయ భద్రతా సలహాదారు డాక్టర్‌ మోయిద్‌ యూసఫ్‌ల బృందం ఉన్నట్లు పాక్‌ విదేశాంగశాఖ కార్యాలయం తెలిపింది.

ఇదీ చూడండి:ఏ క్షణమైనా ఉక్రెయిన్​పై అటాక్​.. వారంతా వెనక్కి రావాలని రష్యా ఆదేశం!

ABOUT THE AUTHOR

...view details