Pak PM Imran Khan News: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఆలూ, టమాట ధరలు లెక్కేయడానికి తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. దేశ యువత కోసమే వచ్చానని స్పష్టం చేశారు. పంజాబ్ రాష్ట్రంలోని హఫీజాబాద్లోని రోడ్ షోలో పాల్గొన్న ఇమ్రాన్ ఖాన్.. ప్రతిపక్షాలు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడాన్ని ఖండించారు.
"ఆలూ, టమాట ధరలు లెక్కేయడానికి రాజకీయాల్లోకి రాలేదు. దేశ యువత కోసం వచ్చాను. పాకిస్థాన్ గొప్ప దేశం కావాలంటే నిజానికి మద్దతు ఇవ్వాలి. ఇదే విషయాన్ని నేను పాతికేళ్లుగా చెబుతున్నా. దేశంలోని అవినీతిపరులైన రాజకీయ నేతలను అడ్డుకునేందుకు న్యాయవ్యవస్థకు అధికారం ఉంది." అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పాకిస్థాన్ గొప్ప దేశంగా అవతరించబోతుందని.. తన మాటలు గుర్తుపెట్టుకోవాలన్నారు ఖాన్. తమ ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో లాభాలను చేకూరుస్తాయని ధీమా వ్యక్తం చేశారు.