పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని భారత్ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. ఒకానొక సందర్భంలో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బహిరంగంగానే అంగీకరించారు. గత ప్రభుత్వాలు ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చాయని వెల్లడించారు. అయితే ఓవైపు ఆశ్రయం ఇచ్చామని చెబుతూనే ఉగ్రవాదం కారణంగా పాకిస్థాన్ బలైందని పొంతన లేకుండా వాదించారు.
లాడెన్ అమరవీరుడంటూ కీర్తించిన ప్రధాని - పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
19:02 June 25
లాడెన్ అమరవీరుడంటూ కీర్తించిన ప్రధాని
ప్రస్తుతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు ఇమ్రాన్. ఈ సారి మరో మెట్టు పైకెక్కి అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను 'అమరవీరుడు' అని కీర్తించారు. అదీ పాకిస్థాన్ పార్లమెంటు సాక్షిగా.. ఆపై పాక్ ఉగ్రవాద బాధిత దేశమని మరోసారి అసంబద్ధంగా వాదించారు. పాక్ జాతీయ అసెంబ్లీలో గురువారం ఓ అంశంపై చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఇమ్రాన్ ఖాన్.
"ఉగ్రవాదంపై పోరులో అమెరికాకు మద్దతుగా నిలిచాం. ఆ విషయంలో మనకు నష్టమే జరిగింది. అఫ్గానిస్థాన్ సంబంధించిన విషయంలోనూ పాక్ పైనే నిందలు వేశారు. ఉదాహరణకు ఓ ఘటన చెబుతా. ఈ విషయంలో మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం.
అబోటబాద్లో ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా సేనలు చంపేశాయి. లాడెన్ అమరుడయ్యాడు. తర్వాత ఏమైంది? ప్రపంచమంతా పాకిస్థాన్నే తప్పుబట్టాయి. ఉగ్రవాదంపై పోరులో 10 ఏళ్లుగా నిందలు ఎదుర్కొంటూ వస్తున్నాం. అమెరికా మన దేశంలోకి వచ్చి ఒకర్ని చంపేవరకూ ఆ విషయం మనకు తెలియదు."
- ఇమ్రాన్ ఖాన్, ప్రధానమంత్రి