పాకిస్థాన్‌లోని కరాచీలో ఇటీవలే జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ). కరాచీ విమానాశ్రయానికి 15 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడే.. విమానం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఎత్తులో ఉండటమే కాక, వేగంగా కూడా ఉన్నట్లు పైలట్‌ను హెచ్చరించినట్టు తెలిపింది. పైలట్ మాత్రం తాను సంతృప్తిగా ఉన్నానని చెప్పి ఆ హెచ్చరికల్ని పట్టించుకోలేదని పేర్కొంది.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నివేదిక వివరాల ప్రకారం.. లాహోర్ నుంచి శనివారం మధ్యాహ్నం 1:05 గంటలకు విమానం బయలుదేరింది. 2:30గంటలకు కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. ఆ సమయానికి కరాచీ నుంచి 15 నాటికల్ మైళ్ల దూరంలోని మక్లి వరకు చేరుకుంది విమానం. 7వేల అడుగుల ఎత్తులో ప్రయాణించాల్సి ఉండగా, విమానం 10వేల అడుగులకు పైనే ఉంది. ఎత్తు తగ్గించుకోవాలని పైలట్‌ను ఏటీసీ హెచ్చరించింది. ఆ అవసరం లేదని అతను పట్టించుకోలేదు.
ఆ తర్వాత కరాచీ విమానాశ్రయానికి 10 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు 3వేల అడుగుల ఎత్తులో ఉండాల్సిన విమానం, 7వేల అడుగుల ఎత్తుకు మించి ప్రయాణించింది. ఏటీసీ రెండోసారి పైలట్‌ను హెచ్చరించింది. మరోసారి అతను పట్టించుకోలేదు. తాను పరిస్థితిని అదుపు చేయగలనని, ల్యాండింగ్‌కు సిద్ధంగా ఉన్నట్లు బదులిచ్చాడు.