No-trust motion against PM Imran Khan: అటు విపక్షాల నుంచి, ఇటు సొంత పార్టీలోని అసమ్మతి నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భవితవ్యం తేలే రోజు దగ్గర పడింది. తీర్మానంపై ఓటింగ్ నిర్వహించేందుకు వీలుగా పాకిస్థాన్ పార్లమెంట్ దిగువ సభ అయిన నేషనల్ అసెంబ్లీని మార్చి 25న (శుక్రవారం) సమావేశ పరిచేందుకు స్పీకర్ నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో తిరుగుబావుటా ఎగరవేసిన సొంత పార్టీ నేతలను దారికితీసుకొచ్చే ప్రయత్నాలను ఇమ్రాన్ మొదలు పెట్టారు.
పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)కి చెందిన సుమారు 100 మంది చట్టసభ సభ్యులు ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. దేశంలో ఆర్థిక సంక్షోభానికి, ద్రవ్యోల్బణం పెరుగుదలకు తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ప్రభుత్వమే కారణమని వారు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నేషనల్ అసెంబ్లీ కార్యదర్శికి మార్చి 8న తీర్మానాన్ని అందజేశారు. ఈ నేపథ్యంలో మార్చి 25న శుక్రవారం 11 గంటలకు 41వ సెషన్ ప్రారంభమవుతుందని స్పీకర్ అసద్ ఖాజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఓఐసీ సమావేశం తర్వాతే..
నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన 14 రోజులకే ఓటింగ్ నిర్వహించాల్సి ఉంటుందని విపక్షాలు చెబుతున్నాయి. ఆ లెక్కన మార్చి 21నే జాతీయ అసెంబ్లీ సమావేశం అవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ప్రత్యేక పరిస్థితుల్లో జాతీయ అసెంబ్లీ సమావేశాలు ఆలస్యం అవ్వొచ్చని పాక్ హోంమంత్రి షేర్ రషీద్ ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. మార్చి 22న పార్లమెంట్ హౌస్‌లో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ (ఓఐసీ) సదస్సు జరగనుంది. రెండ్రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి 50 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ సదస్సు జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని, దీన్ని విపక్షాలు ఆటంకం తలపెట్టకూడదని రషీద్ విజ్ఞప్తి చేశారు. అయితే, తొలుత సెషన్ కోసం పట్టుబట్టిన విపక్షాలు.. తర్వాత సదస్సు నేపథ్యంలో తన కొంత మెత్తబడ్డాయి.
వస్తే వదిలేస్తా.. లేదంటే..
ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మార్చి 25న చర్చ జరుగుతుంది. దీనిపై మూడు నుంచి ఏడు రోజుల్లో ఓటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. 342 మంది ఉన్న నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్‌ను తొలగించాలంటే విపక్షాలకు 172 మంది మద్దతు కావాలి. పీటీఐకి ప్రస్తుతం 155 మంది సభ్యులు ఉన్నారు. మరో ఆరు చిన్న చిన్న పార్టీలకు చెందిన 23 మంది ఇమ్రాన్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన 24 మంది తిరుగుబావుటా ఎగరవేయడం ఇమ్రాన్‌కు తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో రెబల్‌గా మారిన పార్టీ సభ్యులకు ఇమ్రాన్ ఓ ఆఫర్ ఇచ్చారు. పార్టీకి వ్యతిరేకంగా మారిన వారంతా తిరిగొచ్చేస్తా తండ్రిలా క్షమించి వదిలేస్తానని, ఎలాంటి చర్యలూ తీసుకోబోనని హామీ ఇచ్చారు. లేదంటే సామాజిక బహిష్కరణ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పిల్లలకు పెళ్లిళ్లు కూడా చేయలేరని వార్నింగ్ ఇచ్చారు.
ఇదీ చూడండి:భారత్‌పై పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రశంసలు.. ఏమన్నారంటే?