నిషేధం విధించిన సంస్థలపై కఠిన చర్యలు అమలు చేయకుంటే పాక్‌కు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు పాకిస్థాన్ ఆర్థిక కార్యదర్శి ఆరిఫ్ అహ్మద్ ఖాన్.అంతేకాక 'ఎఫ్ఏటీఎఫ్' సిఫార్సులన్నింటినీ వెంటనే అమలు చేయాలన్నారు. 'ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్' నుంచి ఆర్థిక సహకారం ఆగిపోకూడదంటే పాక్ వెంటనే సిఫార్సులు అమలు చేయాలన్నారు.
ప్యారిస్ కేంద్రంగా ఉన్న అంతర్జాతీయ టెర్రర్ వాచ్ డాగ్ 'ఎఫ్ఏటీఎఫ్' గత ఏడాది పాక్‌కు 40 సిఫార్సులు చేసింది. 'గ్రే లిస్ట్' నుంచి పాక్‌ను తొలగించేందుకు ఈ సిఫార్సులను అమలు చేయాలని తెలిపింది. అలా చేయకపోతే పాక్‌ను బ్లాక్ లిస్టులో చేరుస్తామని హెచ్చరించింది.
ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ)కి చెందిన ఉప కమిటీ సమావేశంలో ఆరిఫ్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన పలు వివరాలు వెల్లడించారు.