భారత్తో సంబంధాలు అట్టడుగుకు చేరుకున్నాయని పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. కశ్మీర్ సమస్యతో పాటు ఈ విభేదాలను తొలగించేందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ తన అత్యున్నత అధికారాన్ని ఉపయోగించాలని కోరారు.
కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సులో ఇరు దేశాల నేతలు పాల్గొన్నారు. ఇదే వేదికగా ఇరు దేశాల మధ్య శాంతి కోసం మోదీతో మాట్లాడే అవకాశం రావాలని కోరుకున్నారు ఇమ్రాన్. ఇతర దేశాలతో మంచి సంబంధాలు నెరిపేలా ఎస్సీఓ మంచి వేదికనిచ్చిందని పేర్కొన్నారు.
"పక్క దేశాలతో ముఖ్యంగా భారత్తో శాంతి చర్చలకు ఎలాంటి మధ్యవర్తిత్వాన్ని అయినా అంగీకరిస్తాం. మూడు చిన్న యుద్ధాలు ఇరు దేశాలకు ఎంతో నష్టాన్ని కలిగించి పేదరికాన్ని మిగిల్చాయి. భారత్తో ఉన్న మరో ముఖ్యమైన విభేదం కశ్మీర్. రెండు దేశాల ప్రభుత్వాలు, అధినేతలు తలుచుకుంటే సమస్య పరిష్కారమవుతుంది. దురదృష్టవశాత్తు మాకు భారత్ నుంచి ఎలాంటి సహకారం లేదు. మోదీ తన అధికారాన్ని వాడి ఉపఖండంలో శాంతిని నెలకొల్పుతారని భావిస్తున్నాం."