కరోనా టీకాలు విస్తృతంగా పంపిణీ చేసేందుకు ప్రపంచ దేశాలు కృషి చేస్తుంటే.. పాకిస్థాన్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. టీకాలను కొనుగోలు చేసే ఆలోచన తమకు లేదని తేల్చిచెప్పేసింది. హెర్డ్ ఇమ్యూనిటీ ద్వారా కరోనాను ఎదుర్కొంటామని ప్రకటించింది. కొనుగోళ్లు జరిపేందుకు ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇచ్చినా ఎవరూ ఆసక్తి చూపకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ఇప్పటివరకు మూడు సంస్థలు మాత్రమే టీకాల దిగుమతికి దరఖాస్తు చేసుకున్నాయని పేర్కొంది పాక్ ప్రభుత్వం. కానీ దరఖాస్తుల్లో వ్యాక్సిన్ కొనుగోలుకు సరైన వివరణ లేకపోవడం వల్ల వాటిని తిరస్కరించామని తెలిపింది. అయితే ఎవరైనా వ్యాక్సిన్లను ఉచితంగా అందిస్తే పంపిణీకు సిద్ధమని పేర్కొనడం గమనార్హం. ప్రజా పద్దుల కమిటీకి జాతీయ ఆరోగ్య శాఖ కార్యదర్శి అమిర్ ఆష్రఫ్ ఖవాజా గురువారం ఈ వివరాలను వెల్లడించారు.
ఇప్పటికే ఐదు లక్షల డోసులు..
చైనాకు చెందిన సినోఫార్మ్ సంస్థ పాకిస్థాన్‌కు 10 లక్షల డోసులను అందించేందుకు సిద్ధమైందని అమిర్ తెలిపారు. ఇందులో 5 లక్షల డోసులను సంస్థ ఇప్పటికే పంపిందని స్పష్టం చేశారు. వీటిలో 2.75 లక్షల డోసులను కొవిడ్ చికిత్స అందిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందికి పంపిణీ చేశామని పేర్కొన్నారు. రెండో విడతలో 65 ఏళ్లు దాటిన వృద్ధులు సహా ఇతర విభాగాల వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు.