పాకిస్థాన్‌కు ఆర్థిక సాయం చేసేందుకు ఆర్థిక కార్యాచరణ దళం(ఎఫ్ఏటీఎఫ్) నిర్దేశించిన 6 కీలక విధులను నిర్వర్తించడంలో ఇమ్రాన్‌ఖాన్ సర్కారు విఫలమైంది. ఈ క్రమంలో అక్టోబర్ 21 నుంచి 23 వరకు జరిగే ఎఫ్ఏటీఎఫ్ భేటీలో పాకిస్థాన్‌ను "గ్రే" జాబితా నుంచి తొలగించే అంశంలో ఏ నిర్ణయం ఉండకపోవచ్చని తెలుస్తోంది.
భారత్‌కు మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఉగ్రవాదులైన మౌలానా మసూద్ అజర్, హఫీజ్ సయీద్‌పై చర్యలు తీసుకోకపోవడం సహా ఉన్నట్టుండి 4 వేల మంది ఉగ్రవాదులు.. ముష్కరుల జాబితా నుంచి మాయమవడం, పాక్ గడ్డ నుంచి ఉగ్రవాదులకు ఆర్థికపరమైన సహాయం ఇంకా అందుతూ ఉండడం వంటి చర్యలను ఎఫ్ఏటీఎఫ్ తీవ్రంగా పరిగణిస్తోంది.
ఎఫ్ఏటీఎఫ్లో నామినేటింగ్ దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సైతం పాక్ చర్యల పట్ల పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పాక్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకోవడంలో విఫలమైందని భావిస్తున్నాయి.
అప్పులు కష్టమే!
రోజురోజుకు దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థను చక్కబరుచుకునేందుకు అప్పులబాట పడుతున్న పాకిస్థాన్.. ఎఫ్ఏటీఎఫ్ విధించిన 27 అంశాలను అమలు చేసేందుకు అంగీకరించింది. అయితే అందులో 21 మాత్రమే పాటించింది. కీలకమైన మిగిలిన ఆరింటిని అమలు చేయడంలో విఫలమైంది. కాబట్టి గ్రే జాబితా నుంచి పాక్‌ను తొలగించడం అసాధ్యమే అవుతుంది. ఈ క్రమంలో పాక్‌కు అప్పులు పుట్టడం కూడా కష్టమే.
2018 జూన్‌లో పాకిస్థాన్‌ను గ్రే లిస్ట్‌లో చేర్చుతూ ఎఫ్ఏటీఎఫ్ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు పాటించడంలో విఫలమవుతూ అప్పటి నుంచి పాకిస్థాన్ అదే జాబితాలో కొనసాగుతోంది. గ్రే లిస్ట్ నుంచి పాకిస్థాన్ బయటపడాలంటే 12 ఓట్లు(మొత్తం 39 ఓట్లు) సాధించాల్సి ఉంటుంది. బ్లాక్ లిస్ట్‌ను తప్పించుకోవడానికి మూడు దేశాల మద్దతు అవసరం ఉంటుంది. చైనా, టర్కీ, మలేసియా దేశాలు పాకిస్థాన్ బ్లాక్ లిస్ట్‌లో చేరకుండా అడ్డుపడుతున్నాయి.
ఇదీ చదవండి-పాక్ 'బ్లాక్‌లిస్ట్' భవితవ్యం తేలేది ఈ నెలలోనే