నవాజ్ షరీఫ్‌ను నేరస్థుడిగా ప్రకటించకముందే.. నవంబర్ 24లోగా కోర్టు ముందు హాజరవ్వాలని పాకిస్థాన్‌లోని ఓ కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం షరీఫ్ లండన్‌లో నివాసం ఉంటున్నారు. ఇటీవలే కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయగా.. షరీఫ్ దాన్ని తిరస్కరించారు. దీనిపై ఆగ్రహించిన కోర్టు ఈ విధంగా స్పందించింది.
లిఖిత పూర్వకంగా..
అల్ అజీజియా, అవెన్‌ఫీల్డ్ గ్రాఫ్ట్ కేసులకు సంబంధించి షరీఫ్ కోరిన వినతిపై ఇస్లామాబాద్ హైకోర్టు కార్యాలయం శుక్రవారం లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేసిందని ఓ పత్రిక ప్రచురించింది.
ఉన్నతాధికారుల మాట
నవాజ్ షరీజ్ అరెస్టుకు సంబంధించి.. అక్టోబర్ 7న కొందరు ఉన్నతాధికారుల వాదనను రికార్డు చేసింది కోర్టు. దౌత్యాధికారి దిల్దార్ అలీ అబ్రో, లండన్‌లోని పాకిస్థాన్ హైకమిషన్ దౌత్యాధికారి రావు అబ్దుల్ హన్నన్, ఐరోపా విదేశాంగ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ మహమ్మద్ ముబాషిర్ ఖాన్‌ను కోర్టు ప్రశ్నించింది.