భారత నౌకాదళ విశ్రాంత అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కేసులో విచారణకు సహకరించాలని భారత్‌ను కోరింది పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ హైకోర్టు. కోర్టు ముందు హాజరైతే సార్వభౌమాధికారాన్ని వదులుకున్నట్లు కాదని పేర్కొంది.
జాదవ్‌కు న్యాయవాదిని నియమించే అంశంపై ఇస్లామాబాద్ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా వాదనలు వినిపించిన పాకిస్థాన్ అటార్నీ జనరల్ ఖలీద్ జావెద్ ఖాన్... కోర్టు విచారణకు భారత్ ఉద్దేశపూర్వకంగానే గైర్హాజరవుతోందని అన్నారు. పాకిస్థాన్ కోర్టుల్లో హాజరు కాకుండా ఉండేందుకు భారత్ అభ్యంతరాలను లేవనెత్తుతోందని చెప్పారు. న్యాయవాదిని ఏర్పాటు చేసేందుకూ నిరాకరించిందని తెలిపారు. 'ఇది.. భారత్ తన సార్వభౌమ హక్కులను వదులుకోవడానికి సమానం' అని వ్యాఖ్యానించారు.
'సార్వభౌమం వదులుకున్నట్లు కాదు'
దీనిపై స్పందించిన ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. ఓ కేసులో ఐదుగురు ఖైదీల విడుదల కోసం భారత హైకమిషన్ ఇదే కోర్టుకు వచ్చారని, తీర్పు సైతం వారికి అనుకూలంగా వచ్చిందని గుర్తు చేశారు. అలాంటిది ఇప్పుడు అదే న్యాయస్థానం చట్టబద్ధతను ప్రశ్నిస్తున్నారని అన్నారు. పాక్ కోర్టులపై భారత్ ప్రతికూల వ్యాఖ్యలు చేసినప్పటికీ.. జాదవ్ కేసులో విచారణ సరైన జరిగేలా మానవతా దృక్పథంతో వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. కోర్టులకు హాజరు కావడం అంటే సార్వభౌమ హక్కులను వదులుకున్నట్లు కాదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం స్పందించకపోతే.. పిటిషన్‌ను కోర్టు కొట్టివేస్తామని మరో న్యాయమూర్తి జస్టిస్ ఔరంగజేబ్ పేర్కొన్నారు.
అయితే, భారత ప్రభుత్వానికి కావాల్సింది కూడా ఇదేనని అటార్నీ జనరల్ చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని పాక్ విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లాలని అటార్నీ జనరల్‌ను ఆదేశించింది న్యాయస్థానం. తర్వాతి వాదనలను జూన్ 15కు వాయిదా వేసింది.
భారత నేవీ విశ్రాంత అధికారి అయిన జాదవ్‌పై ఉగ్రవాదం, గూఢచర్యం అభియోగాలు మోపుతూ 2017లో ఉరిశిక్ష విధించింది పాకిస్థాన్ సైనిక కోర్టు. ఈ తీర్పుపై అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించింది భారత్. ఉరిశిక్షను సవాల్ చేసేందుకు న్యాయవాదిని నియమించుకునే అవకాశం ఇవ్వాలని కోరింది. దీనిపై తీర్పు భారత్‌కు అనుకూలంగా వచ్చింది.
ఇదీ చదవండి:'జాదవ్‌కు న్యాయవాదిని నియమించుకోండి'