అణ్వాయుధ దేశాలైన భారత్-పాక్‌ల మధ్య యుద్ధమే వస్తే... అది సంప్రదాయబద్దమైన యుద్ధంగా మాత్రం ఉండబోదని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వ్యాఖ్యానించారు. స్వేచ్ఛ కోసం అణుయుద్ధం చేయడానికి పాక్ సిద్ధమేనని.. అల్ జజీరాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూ లో ఆయన పేర్కొన్నారు.
"అణ్వస్త్ర సంపన్న దేశాలైన భారత్-పాక్‌ల మధ్య యుద్ధమే వస్తే.. అది అణుయుద్ధంతోనే ముగుస్తుంది. ఓటమి ఒప్పుకొని లొంగిపోవాలా? స్వేచ్ఛ కోసం ప్రాణాలు పణంగా పెట్టాలా? అనే పరిస్థితే వస్తే పాక్.. ప్రాణాలే ధారబోస్తుంది."-ఇమ్రాన్‌ఖాన్, పాకిస్థాన్ ప్రధాని.
శాంతియుత పరిష్కారం కోసమే
'కశ్మీర్' సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవడం కోసమే పాక్ అంతర్జాతీయ వేదికలను ఆశ్రయిస్తోందని ఇమ్రాన్‌ఖాన్ స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఉపఖండంలో చెలరేగుతున్న ఉద్రిక్తతలను తగ్గించడానికే తాము ఐక్యరాజ్యసమితి, మిగతా అంతర్జాతీయ వేదికలనూ ఆశ్రయించామని ఆయన పేర్కొన్నారు.