పాకిస్థాన్ దేశంలోని డబ్బంతా విదేశీ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లుగా మారుస్తున్నారు అక్కడి వ్యాపారులు. 1,52,500 విదేశీ బ్యాంకు ఖాతాల్ని పాక్ పౌరులు కలిగి ఉన్నారని ప్రకటించారు పాక్ రెవెన్యూ శాఖ సహాయమంత్రి హమ్మద్ అజార్. వీటిలో 11 బిలియన్ అమెరికన్ డాలర్లు డిపాజిటై ఉన్నట్లు వెల్లడించారు.
ఈ విదేశీ ఖాతాల్లోని నగదులో సగం వరకూ పన్ను చెల్లించని నల్లధనం ఉన్నట్లు అజార్ పేర్కొన్నారు. అక్రమ వ్యాపారాలు చేసేవారు నగదును విదేశీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారని ఆరోపించారు. విదేశీ ఖాతాలపై 'ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ' నిఘా ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. పాక్ దేశీయులు తమ బ్యాంకు ఖాతాల వివరాల్ని ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ(ఒకెడ్)తో పంచుకున్నట్లు ప్రస్తావించారు.
జాతీయ రిజిస్ట్రేషన్ ప్రాధికార సంస్థ, పాక్ దర్యాప్తు సంస్థ, పాక్ కేంద్ర బ్యాంకు 'ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ రెవెన్యూ' వద్ద ఉన్న వివరాల ఆధారంగా ఈ ఖాతాలు వెలికితీసినట్లు ఆయన స్పష్టం చేశారు. పన్ను ఎగవేతదారుల వివరాల్ని వెలికి తీసే పనిలో సగం వరకు విజయం సాధించామన్నారు.