పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ చైనా పర్యటనలో ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. పర్యటనకు ముందు వరకు ఇమ్రాన్ సహా కొంతమంది ఉన్నతాధికారులు మాత్రమే ఈ బృందంలో ఉన్నారు. కానీ చివరి 24గంటల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రధాని సహా అనేక మంది మంత్రులు.. ముఖ్యంగా ఆర్మీ చీఫ్ ఖమర్ జావెద్ బజ్వాని బృందంలో చేర్చారు. ఇమ్రాన్‌ఖాన్ చైనాకు చేరకముందే బజ్వా చైనాకు వెళ్లి అక్కడి సైనికాధికారులతో చర్చలు చేపట్టారు. పాకిస్థాన్ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించడానికి బజ్వా ప్రయత్నిస్తున్నారన్న నివేదికల తరుణంలో ఈ పరిణామాలు సర్వత్ర చర్చనీయాంశమయ్యాయి.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఇమ్రాన్ భేటీ సమయంలో బజ్వా కూడా అక్కడే ఉండనున్నారు. ఒక దేశ సైన్యాధ్యక్షుడు ప్రధానితో కలిసి చర్చల్లో పాల్గొనడం చాలా అరుదు. కానీ, బజ్వా పాక్ విదేశాంగ విధానంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. పైగా చివరి క్షణంలో బజ్వాని పర్యటన బృందంలో చేర్చడం.. ఈ మార్పులకు చైనా అంగీకరించడాన్ని చూస్తే ఆయన పాత్ర ఎంతో కీలకమని తెలుస్తోంది.