తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​ విమానాలను భారత్​ తరిమికొట్టిందిలా...

బాలాకోట్​ వాయు దాడులు... పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో భారత్​ విజయవంతంగా చేసిన దాడి...  పుల్వామా దాడి అనంతరం తీవ్రవాదాన్ని ఎంత వరకు సహించేది లేదని పాక్​కు చెప్పిన పాఠం... ఇదే రీతిలో పాక్​ కూడా మనదేశంపై దాడికి యత్నించింది. కానీ విఫలమైంది. మన వాయుసేన విజయవంతంగా ఎదుర్కుంది. ఎలా?

పాక్​ విమానాలను భారత్​ తరిమికొట్టిందిలా...

By

Published : Mar 27, 2019, 6:23 PM IST

ఫిబ్రవరి 14... పుల్వామాలో సీఆర్​పీఎఫ్​ వాహన శ్రేణిపై ఉగ్రదాడి.

ఫిబ్రవరి 26... బాలాకోట్​ ఉగ్రస్థావరంపై భారత వాయుసేన దాడి.

ఫిబ్రవరి 27... భారత సైనిక స్థావరాలపై దాడికి పాక్​ వాయుసేన విఫలయత్నం.

ఫిబ్రవరి 27న ఏం జరిగిందో అందరికీ తెలుసు. కానీ... పాకిస్థాన్​ యుద్ధవిమానాలను భారత వాయుసేన ఎలా తరిమికొట్టిందో తెలుసా?

జరిగిన తీరిది...

భారత్​పై దాడి కంటే ముందు పాకిస్థానీ యుద్ధ విమానాలు వారి దేశంలోని వివిధ స్థావరాల నుంచి పాక్​ ఆక్రమిత కశ్మీర్​, ఉత్తర పాకిస్థాన్​ ప్రాంతానికి చేరుకున్నాయి. అమెరికా ఎఫ్​-16 యుద్ధ విమానాల సారథ్యంలో ఫ్రాన్స్​ మిరాజ్​-3ఎస్​, చైనా జేఎఫ్​-17 రకాలకు చెందిన 20 విమానాలను ఉపయోగించినట్లు సమాచారం. సరిహద్దుకు 20 కిలోమీటర్ల దూరంలో పాక్​ భూభాగం నుంచే దాడి చేసినట్లు తెలుస్తోంది. 1,000 కిలోల 11 హెచ్​-4 బాంబులతో భారత్​కు చెందిన మూడు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నారు.

అధునాతన ఎఫ్​-16 విమానాలను ఉపయోగించి గాలి నుంచి గాలిలోని లక్ష్యాలను చేధించగల క్షిపణులను ప్రయోగించి, భారత విమానాలను ఎదుర్కొనేందుకు యత్నించింది పాక్​. అదే సమయంలో మిరాజ్​-3ఎస్​లతో గాలి నుంచి ఉపరితలంపైకి లక్ష్యాలను చేధించగల క్షిపణులతో భారత సైనిక స్థావరాలపై దాడి చేసింది. భారత్​ వెనువెంటనే స్పందించింది.

అందుబాటులో ఉన్న ప్రతి విమానాన్ని ఉపయోగించారు అధికారులు. ఈ క్రమంలోనే మిగ్​-21 యుద్ధ విమానం నుంచి ఆర్​-23 గాలి నుంచి గాల్లోకి ప్రయోగించగల క్షిపణితో పాక్​ ఎఫ్​-16 విమానాన్ని కూల్చివేశారు.

అప్పటికే సిద్ధంగా ఉన్న సుఖోయ్​- 30ఎఫ్​కేఐ విమానాలు చాఫ్స్​ను వదిలి శత్రు క్షిపణులను ఎదుర్కొన్నాయి. ఛాప్స్​ అనేవి శత్రు రాడార్​లను తప్పుదోవ పట్టించటానికి ఉపయోగించే వ్యూహాత్మక సామగ్రి. ఈ సుఖోయ్​ విమానాలే గాలిలో అత్యంత వేగంగా ఫల్టీలు కొడుతూ ఎఫ్​-16లు ప్రయోగించిన ఆమ్​రామ్​ క్షిపణుల నుంచి తప్పించుకున్నాయి.

భారత్​, పాక్​ బాంబులు ఒకేలాంటివి...

భారత్​, పాక్​ ఉపయోగించిన బాంబులకు కొన్ని పోలికలు ఉన్నాయి. మిరాజ్​ -3ఎస్​ నుంచి ప్రయోగించిన హెచ్​-4 బాంబులు భారత్​ ఉపయోగించిన స్పైస్​-2000 బాంబులు ఒకే విధమైనవి. హెచ్​-4 బాంబులను పాకిస్థాన్​ దక్షిణాఫ్రికా సహాయంతో తయారు చేసింది.

చెట్లకు మాత్రమే నష్టం...

పాక్​ హెచ్​-4 బాంబులు అంత సమర్థమైనవి కాకపోవటం వల్ల నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. జమ్ముకశ్మీర్​లోని సైనిక స్థావరంపై చేసిన దాడిలో ఒక భవనానికి రక్షణగా ఉన్న పెద్ద చెట్టు మాత్రమే కూలిపోయింది. భవంతికి ఎలాంటి నష్టం కలగలేదని తెలుస్తోంది.

ఈ దాడి జరిగినప్పుడు ఉన్నతాధికారులు ఆయా స్థావరాల్లోనే ఉన్నారు. పాక్​ ప్రయోగించిన మూడు బాంబులు పూంచ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పడ్డాయి.
పాకిస్థాన్​ బాంబులు, వాటి శకలాలను విశ్లేషించటానికి అధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details