కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు దేశాలన్నీ శాస్త్రీయంగా కృషి చేస్తున్నాయి. ఇందుకు భిన్నంగా ఇరాన్లో మద్యంతో వైరస్‌ను కట్టడి చెయ్యొచ్చన్న తప్పుడు సమాచారం వ్యాప్తిలో ఉంది. ఈ నేపథ్యంలో విషపూరిత ఆల్కహాల్ సేవించి 728మంది ప్రాణాలు కోల్పోయారు.
అయితే మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని ఆరోగ్య శాఖ సలహాదారు హొసేన్ హస్సానియన్ వెల్లడించారు. ఆసుపత్రి బయట మరణించిన బాధితుల సంఖ్య గణాంకాల్లోకి రాకపోవడం ఇందుకు కారణమని తెలిపారు. ఇప్పటివరకు 5,011 మంది మిథనాల్ బారిన పడి ఉంటారని అంచనా వేశారు.
కంటిచూపు కోల్పోయిన 90మంది..
ఈ ప్రమాదకర ఆల్కహాల్ కారణంగా ఇప్పటివరకు 90మంది కంటిచూపు కోల్పోయారు. అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని అధికారవర్గాలు వెల్లడించాయి.
దుష్ప్రభావాలు ఇవే..
మిథనాల్ వల్ల అవయవాలు విఫలమవడం, మెదడుపై ప్రభావం చూపడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఛాతి నొప్పి, వికారం, శ్వాస క్రియ పెరగడం, కంటిచూపు కోల్పోవడం, కోమాలోకి వెళ్లడం వంటి లక్షణాలు ఉంటాయి.
అక్రమ తయారీదారులతో..
ఆల్కహాల్ సేవించడంపై ఇరాన్లో నిషేధం ఉంది. అయితే మైనారిటీలుగా ఉన్న క్రైస్తవులు, యూదులు, జోరాస్ట్రియన్లు ప్రైవేటుగా మద్యం సేవించేందుకు చట్టాలు అనుమతిస్తున్నాయి. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో శానిటైజర్ల కోసం ఆల్కహాల్ తయారీకి ఫ్యాక్టరీలకు తాజాగా అనుమతులు ఇచ్చారు.
కొందరు అక్రమార్కులు మిథనాల్‌కు రంగు కలిపి దానిని మద్యంగా తయారు చేస్తున్నారు. సంప్రదాయ ఆల్కహాల్‌కు మిథనాల్‌ను కలిపి అమ్ముతున్నారు. ఇదే ఇరాన్ వాసులకు శాపంగా పరిణమించింది.
ఇదీ చూడండి:వైద్యులకు, వైరస్‌కు మధ్య అడ్డు 'పెట్టె'