పైన ఫొటోలో కన్పిస్తున్నది ప్యాసింజర్ రైల్లోని జనరల్ బోగీ కాదు.. అఫ్గాన్ పౌరులతో నిండిపోయిన అమెరికా విమానం..! తాలిబన్ల రాకతో భీతిల్లుతున్న అక్కడి ప్రజలు.. బతుకు జీవుడా అంటూ దేశం విడిచి పారిపోతున్నారు. ఇందుకోసం ప్రాణాలను తెగించేందుకైనా వెనుకాడటం లేదు. కాబుల్ విమానాశ్రయం నుంచి వచ్చిన అమెరికా విమానంలో కన్పించిన ఈ దృశ్యం.. అఫ్గాన్ పౌరుల దుస్థితికి అద్దం పడుతోంది. ఏకంగా 640 మంది విమానంలో కింద కూర్చుని ప్రయాణించారు.
తాలిబన్ల అరాచక పాలనతో మళ్లీ చీకటి రోజులు రాబోతున్నాయన్న భయాందోళనలతో వేలాది మంది అఫ్గాన్ వాసులు సోమవారం దేశం విడిచి వెళ్లేందుకు కాబుల్ విమానాశ్రయానికి పోటెత్తారు. రద్దీ పెరగడం వల్ల ఎయిర్‌పోర్టు గేట్లు మూసివేస్తే ప్రహరీ పైనుంచి దూకి, ఇనుప కంచెలను దాటుకుని లోపలికి ప్రవేశించారు. విమానాల్లో చోటు కోసం రన్‌వేపై పరుగులు తీశారు. లోపలికి ఎక్కేందుకు ఒకర్నొకరు తోసుకున్నారు. అలా అమెరికాకు చెందిన ఓ విమానంలో దాదాపు 640 మంది అఫ్గాన్ వాసులు ఎక్కి కింద కూర్చున్నారు. వారి వద్ద ఎలాంటి వస్తువులు, లగేజీ కన్పించలేదు. తాలిబన్ల నుంచి తప్పించుకునే క్రమంలో అన్నీ వదులుకుని ఇతర దేశాలకు పారిపోతున్నారు.