సంస్కృతం.. అతి పురాతన భాష. ఇండో-ఆర్యులకు చెందిన ఈ భాష.. దేశంలో ఎన్నో భాషల పుట్టుకకు మూలం. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా పరిగణిస్తారు. అయితే ప్రస్తుతం ఈ భాషను ఒక్క శాతం కంటే తక్కువ మందే మాట్లాడుతున్నారు. ఇలాంటి తరుణంలో చైనాలో సంస్కృతానికి పెద్దపీట వేయడం విశేషం.
2 వేల ఏళ్లుగా చైనాలో సంస్కృతానికి ఆదరణ లభిస్తోంది. బౌద్ధమతంతో పాటే డ్రాగన్ దేశానికి వెళ్లిన ఈ భాష.. అక్కడి రాజులు, పండితులపై లోతైన ప్రభావం చూపింది. తాజాగా చైనాలోని ప్రతిష్ఠాత్మక పెకింగ్ విశ్వవిద్యాలయంలో సంస్కృత బోధన 100 ఏళ్లు పూర్తి చేసుకుంది.
భారత పండితుడి వల్లే..
చైనాలో సంస్కృతానికి ఆదరణ పెరగడంలో 4వ శతాబ్దానికి చెందిన భారత పండితుడు కుమారజీవ ప్రధాన పాత్ర పోషించారని పెకింగ్ విశ్వవిద్యాలయంలో చైనా-ఇండియా బౌద్ధమత అధ్యయన విభాగ డైరెక్టర్ వాంగ్ బాంగ్వే పేర్కొన్నారు.
కశ్మీర్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుమారజీవ.. 23 ఏళ్ల పాటు చైనాలో ఖైదీగా ఉన్నారు. ఆ సమయంలోనే చైనా భాషలోకి బౌద్ధ సూత్రాలను అనువదించి.. 'చైనా జాతీయ గురువు'గా గుర్తింపు పొందారు.
ఆసియాకే కేంద్రంగా..
నాటినుంచి సంస్కృతం, దాని అనుబంధ సంస్కృతిని నిరంతర అధ్యయనం ద్వారా చైనా పండితులు కాపాడుతూ వచ్చారని వాంగ్ తెలిపారు. శుక్రవారం బీజింగ్‌లోని భారత ఎంబస్సీ వద్ద సంస్కృత భాషా బోధన అప్లికేషన్.. 'లిటిల్ గురు' ఆవిష్కరణ సందర్భంగా దాని విశిష్ఠతపై మాట్లాడారు.
భారత సంస్కృతి, హిందూ మతం, బౌద్ధం, ప్రాచీన భారతీయ వైద్యం, ఖగోళ శాస్త్రం, గణితాన్ని సంస్కృత భాష ద్వారానే చైనీయులు నేర్చుకున్నారని వాంగ్ వెల్లడించారు. 100కు పైగా చైనా పండితులు నలంద విశ్వవిద్యాలయంలో చదువుకున్నట్లు తెలిపారు. భారత్‌లో బౌద్ధమతం ఆదరణ కోల్పోతుంటే.. చైనాలో మరింత బలపడి ఆసియాకే కేంద్రంగా మారింది.
ఇదీ చూడండి:విదేశీ సెలబ్రిటీల ఒంటిపై హిందీ టాటూలు