ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్ అదుపులోకి వస్తుండగా మరికొన్ని దేశాల్లో మాత్రం కొత్తగా మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా జపాన్‌లోనూ వైరస్ తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా నాలుగో వేవ్ భయంతో జపాన్ నగరం ఒసాకా వణికిపోతోంది. మరికొన్ని రోజుల్లోనే జరిగే ఒలింపిక్స్ వేడుకలకు సన్నద్ధం అవుతున్న వేళ.. వైరస్ భయం ఒసాకా నగరాన్ని వెంటాడుతోంది. వైరస్ ఉద్ధృతి పెరగడం జపాన్‌లో రెండో అతిపెద్ద నగరమైన ఒసాకాతో పాటు మరో ఎనిమిది నగరాల్లోనూ హెల్త్ ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ విస్తృతంగా పంపిణీ కొనసాగడం వల్ల కొన్ని దేశాలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నాయి. కానీ, ఇన్నిరోజులు వైరస్ వ్యాప్తిని నియంత్రించగలిగిన జపాన్‌లో మళ్లీ కరోనా విజృంభణ కలవరపెడుతోంది. ప్రస్తుతం కరోనా వైరస్ ఫోర్త్ వేవ్ ధాటికి ఒసాకా వణికిపోతోంది. ఇప్పటికే అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుపోతున్నాయి. ఈ వారంలో 3849 పాజిటివ్ కేసులు నమోదుకాగా జపాన్‌లో సంభవిస్తోన్న కొవిడ్ మరణాలు దాదాపు 25శాతం ఆ ఒక్క నగరంలోనే ఉంటున్నాయి. మూడు నెలల క్రితంతో పోలిస్తే ఇవి ఐదు రెట్లు ఎక్కువ. ఇప్పటికే అక్కడి ఆసుపత్రుల్లో 96శాతం పడకలు కొవిడ్ బాధితులతో నిండిపోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల్లో తీవ్ర లక్షణాలు కనిపిస్తుండడం వల్ల కోలుకోవడం ఇబ్బందిగా మారినట్లు అక్కడి వైద్యులు పేర్కొంటున్నారు. ఇలా ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరగేసరికి అక్కడి ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బ్రిటన్ రకమే కారణమా..?
దాదాపు 90 లక్షల జనాభా కలిగిన ఒసాకా నగరంలో ఈ నెలలో కరోనా తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఇందుకు బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్తరకం కరోనా వైరస్ కారణం అయిఉండవచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. గతకొద్ది రోజులుగా పాజిటివ్ నిర్ధారణ అవుతున్న వారిలో 14శాతం ఆసుపత్రిలో చేరుతున్నట్లు గుర్తించారు. ఇక టోక్యోలోనూ కొవిడ్ బాధితుల్లో 37శాతం మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. వీరిలో తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు కోలుకోవడం ఇబ్బందికరంగా మారిందని అక్కడి వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆసుపత్రుల్లో ఔషధాలు, వెంటిలేటర్ల కొరత ఎక్కువ కావడం సహా రోగుల తాకిడిని తట్టుకునేందుకు ప్రస్తుతం ఉన్న వైద్యులు, నర్సులు సరిపోవడం లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఒసాకాలో ఆరోగ్యవ్యవస్థ కుప్పకూలిపోయిందని అక్కడి కిండాయ్ యూనివర్సిటీ హాస్పిటర్ డైరెక్టర్ యుజి తొహ్డా పేర్కొన్నారు. జపాన్ కేవలం ఇప్పటివరకు వైద్య ఆరోగ్య సిబ్బందిలో సగం మందికి మాత్రమే వ్యాక్సిన్ అందించడం వల్ల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందన్నారు.