భారత నిఘా సంస్థ.. రీసెర్చి, అనలైసిస్ వింగ్(రా) అధిపతి సామంత్ కుమార్ గోయల్‌తో జరిపిన భేటీపై నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ(నేపాల్ కమ్యూనిస్టు పార్టీ-ఎన్‌సీపీ) నాయకుల నుంచి కూడా అసమ్మతి వెలువడుతోంది.
దౌత్య నిబంధనలకు తూట్లు!
బుధవారం సాయంత్రం తన అధికారిక నివాసంలో కేపీ శర్మ.. గోయల్‌తో భేటీ అయ్యారు. నవంబరు మొదటి వారంలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే నేపాల్ అధికార పర్యటన ముందు ఈ భేటీ జరిగింది. దీంతో ఈ సమావేశం దౌత్య నిబంధనలకు తూట్లు పొడుస్తోందని అధికార, విపక్ష పార్టీల నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నేపాల్ విదేశీ వ్యవహారాలకు సంబంధించిన అధికారులను సంప్రదించకుండా అపారదర్శకంగా జరిగిన సమావేశంతో దేశ విధానాలను బలహీన పరచినట్లేనని అధికార పార్టీ సీనియర్ నాయకుడు భీం రావల్ అన్నారు. దౌత్యపరమైన విషయాల్లో రాజకీయ నాయకులు జోక్యం చేసుకోకూడదని, ఆ బాధ్యత దౌత్యాధికారులే నిర్వహించాలని ఎన్‌సీపీ విదేశీ వ్యవహారాల విభాగ ఉప ముఖ్యనేత బిష్ను రిజాల్ చెప్పారు.
ఈ సమావేశంతో దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని విపక్ష పార్టీ నాయకుడు గగన్ తాపా ఆరోపించారు. కాలాపానీ, లిపులేఖ్, లింపియాదుర వంటి ప్రాంతాలను తమ భూభాగంలో చేరుస్తూ నేపాల్ విడుదల చేసిన మ్యాప్ అనంతరం రెండు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడ్డాయి.
ఇదీ చదవండి:పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ- మళ్లీ గ్రే జాబితాలోనే