జపాన్ వైపు భయంకరమైన హగీబిస్ తుపాను దూసుకొస్తోంది. తుపాను తీరాన్ని దాటకముందే భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే తూర్పు టోక్యోలోని చైబాలో ఒక వ్యక్తి మృత్యువాత పడ్డాడు.
చైబాలో టొర్నడో బీభత్సం సృష్టించింది. కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి. తీవ్రమైన గాలుల కారణంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.
భారీ తుపాన్..
హగీబిస్ తుపాను ఈ రోజు సాయంత్రం తూర్పు జపాన్ తీరాన్ని తాకుతుందని ఆ దేశ వాతావరణ శాఖ(జేఎంఏ) తెలిపింది. సుమారు 216 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. భారీ ఎత్తున అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని వెల్లడించింది.
ఏటా సుమారు 20 తుపాన్లు జపాన్ను ముంచెత్తుతూనే ఉంటాయి. అయితే.. 1991 తర్వాత ఆ స్థాయి భారీ తుపానుగా హగీబిస్ను గుర్తించింది జేఎంఏ.