కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మరణశయ్యపై ఉన్న వృద్ధుల ఆవేదన, ప్రార్థన ఒక్కటే- 'ఏ క్షణం నాకు చివరి క్షణం కానుందో. నా ఊపిరి ఏ క్షణం నిలిచిపోనుందో. అనాథగా కన్నుమూయాల్సిందేనా. భగవంతుడా! నా బిడ్డలను ఒక్కసారి చూసుకునే అవకాశమివ్వు. ఒక్కసారి కరుణించు' అని! పడక పడకన చెమ్మగిల్లిన కళ్లలో కనిపించిన ఈ ప్రార్థన... ఇజ్రాయెల్ వైద్యుల హృదయాలను తాకింది. పరిస్థితి విషమించినవారి కడసారి కోరికను ఎందుకు తీర్చలేమని భావించారు... టెల్ అవీవ్‌కు చెందిన సౌరస్కీ మెడికల్ సెంటర్ వైద్యులు.
ప్రత్యేక రక్షణ పరికరాలు వేసి...
కొవిడ్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 75 ఏళ్ల సిమ్హా బెన్షాయ్ పరిస్థితి విషమించింది. ఆయన కుమార్తె ఎలీషెవా స్టెర్న్ ఎలాగైనా తండ్రిని చూడాలనుకుంది. కానీ ఎలా? ఆమె విజ్ఞప్తిని సౌరస్కీ మెడికల్ సెంటర్ వైద్యులు మన్నించారు. స్టెర్న్‌కు ప్రత్యేక రక్షణ వస్త్రాలు తొడిగించారు. తర్వాత వార్డులో ఉన్న తండ్రి వద్దకు తీసుకెళ్లారు. ఒకర్నొకరు చూసుకున్న క్షణాన... వారిద్దరి ఆనందానికి అవధుల్లేవు. మౌన రోదనే కాసేపు వారి భాష అయింది. తాను అందరిలా అనాథలా మరణించడం లేదని బెన్షాయ్ ఎంతో సంతృప్తి చెందారు. ఆ తర్వాత ఆయన కన్నుమూశారు.
ఇలాంటి విషమ పరిస్థితుల్లో ఒక మనిషికి ఇంతకంటే గొప్ప తృప్తిని ఏం అందించగలమని అక్కడి వైద్యులు భావించారు. రోగులందర్నీ కడసారి చూసుకునేందుకు 2వారాలుగా వారి తొలి సంతానానికి అనుమతిస్తున్నారు. ఆప్తులను చూసిన తర్వాత... వారి మాస్కులను, బూట్లను, రక్షణ వస్త్రాలను వైద్యులే దగ్గరుండి అత్యంత జాగ్రత్తగా తొలగిస్తున్నారు.