తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ దేశాల్లో 'ఒమిక్రాన్​'- తీవ్ర రూపంపై డబ్ల్యూహెచ్​ఓ హెచ్చరిక - ప్రపంచ ఆరోగ్య సంస్థ

Omicron variant cases in world: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ మరిన్ని దేశాలకు విస్తరించింది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆస్ట్రేలియా, మలేసియా, శ్రీలంకలో తాజాగా ఈ కొత్త వేరియంట్‌ను గుర్తించారు. ఈ నేపథ్యంలో అనేక దేశాలు కరోనా నిబంధనలను మరింత కఠినతరం చేశాయి. దేశాలన్నీ హై అలర్ట్‌గా ఉండాలన్న డబ్ల్యూహెచ్​ఓ.. వేరియంట్‌ మూలాలు గుర్తించేందుకు నిపుణుల బృందాన్ని దక్షిణాఫ్రికాకు పంపింది.

Omicron variant cases in world
ఒమిక్రాన్ కేసులు

By

Published : Dec 3, 2021, 9:20 PM IST

Omicron variant cases in world: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌.. ప్రపంచ దేశాల్లో గుబులు పుట్టిస్తోంది. క్రమంగా మరిన్ని దేశాలకు విస్తరిస్తూ ఆందోళనను పెంచుతోంది. ఒమిక్రాన్‌ ప్రభావిత దేశాల నుంచి రాకపోకలపై ఆంక్షలు విధించిన అమెరికాకు సైతం ఒమిక్రాన్‌ పాకింది. ఐదు రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌ గుర్తించినట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. నివారణ చర్యలను మరింత ముమ్మరం చేసినట్లు వెల్లడించింది. ఆస్ట్రేలియాలోనూ.. తాజాగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించారు. శ్రీలంకలోనూ తాజాగా ఒకరిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించామని.. ఆ దేశ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ హేమంత హెరాత్ తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారు తప్పకుండా క్వారంటైన్‌లో ఉండాలని శ్రీలంక ఆంక్షలు విధించింది.

Omicron in Malaysia: మలేసియాలోనూ ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించారు. దక్షిణాఫ్రికా నుంచి తిరిగివచ్చిన ఓ మహిళకు ఈ కొత్త వైరస్‌ సోకిందని మలేసియా ప్రకటించింది.

ఒమిక్రాన్‌ వ్యాప్తితో చాలా దేశాలు ఆంక్షలను కఠినతరం చేశాయి. హాంకాంగ్, నెదర్లాండ్స్, నార్వే, రష్యాతో పాటు మరికొన్ని దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై నిబంధనలను కఠినతరం చేశాయి. తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదుతో మలేసియా ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. శ్రీలంకలోనూ విదేశీ ప్రయాణికులపై ఆంక్షలను అమల్లోకి తెచ్చారు. జర్మనీలో నిత్యావసరాలు మినహా మిగిలిన వ్యాపారాలపై ఆంక్షలు విధించారు. బ్రిటన్, అమెరికా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేశాయి.

Lockdown in Slovakia: కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో గత వారమే లాక్​డౌన్​ విధించింది స్లోవకియా. అయినప్పటికీ రోజువారీ కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే 15,278కేసులు వెలుగు చూశాయి. నవంబర్​ 23న వచ్చిన 5వేల కేసుల రికార్డును తిరిగరాసింది. నవంబర్​ 25 నుంచి రెండు వారాల లాక్​డౌన్​ అమలు చేస్తోంది అక్కడి ప్రభుత్వం.

Germany Covid cases: జర్మనీ దేశంలో ప్రతి 100 మందిలో ఒకరికి వైరస్​ సోకినట్లు ఆ దేశా ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశ జనాభాలో 1 శాతానికిపైగా వైరస్​బారినపడ్డారని పేర్కొంది. ఇప్పటికీ వ్యాక్సిన్​ తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని సూచించింది. గురువారం ఒక్కరోజే 74,352 కొత్త కేసులు వచ్చాయి. 390 మంది మరణించారు. జర్మనీలో 9,25,800 యాక్టివ్​ కేసులు ఉన్నట్లు సమాచారం.

South Africa omicron variant: ఒమిక్రాన్‌ వేరియంట్‌ను తొలిసారిగా గుర్తించిన దక్షిణాఫ్రికాలో.. కేసుల సంఖ్య తక్కువ వ్యవధిలోనే రెట్టింపవ్వడం వల్ల ప్రభుత్వం ఆంక్షల కొరఢా ఝుళిపించింది. దక్షిణాఫ్రికాలోని తొమ్మిది ప్రావిన్సుల్లో ఏడు ప్రావిన్స్‌లలో ఒమిక్రాన్‌ వైరస్‌ వ్యాప్తి చెందిందని ఆ దేశ ఆరోగ్య మంత్రి జో ఫాహ్లా వెల్లడించారు. నాలుగో వేవ్‌తో దక్షిణాఫ్రికా ఆర్థిక స్థితి మరింత దిగజారుతోందన్న ఆయన.. ప్రజలందరూ నిబంధనలు పాటించాలని సూచించారు.
మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకుంటున్నామని ఫహ్లా తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా కఠినమైన లాక్‌డౌన్ విధించామన్న ఫాహ్లా.. మరిన్ని తీవ్రమైన ఆంక్షలు విధించే అవకాశం ఉందని తెలిపారు. ఒమిక్రాన్ కారణంగా తక్కువ సమయంలో కేసుల సంఖ్య రెట్టింపయిందని దక్షిణాఫ్రికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్‌కు అగ్ర శాస్త్రవేత్త మిచెల్ గ్రూమ్ తెలిపారు. దక్షిణాఫ్రికాలో ఇటీవల నమోదైన కేసుల్లో.. 75 శాతం కేసులు ఒమిక్రాన్‌ వేరియంట్‌వేనని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ వెల్లడించింది.

WHO on omicron: భారత్‌, జపాన్, మలేషియా, సింగపూర్, దక్షిణ కొరియాలో.. ఒమిక్రాన్‌ బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. ఆసియాలో ఒమిక్రాన్‌ వ్యాప్తి ప్రారంభమైందని.. త్వరలో ఇది తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ఒమిక్రాన్‌ను అడ్డుకోవడం అంత తేలికకాదని తెలిపింది. ప్రభుత్వాలు సరిహద్దు మూసివేతలపైనే దృష్టి పెట్టకుండా నివారణ చర్యలు చేపట్టాలని సూచించింది. త్వరలో ఒమిక్రాన్‌ ఆధిపత్య వేరియంట్‌గా మారే అవకాశం ఉందని ఆస్ట్రేలియా పరిశోధకులు తెలిపారు.

ఒమిక్రాన్‌ మూలాలు కనుక్కునేందుకు దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్ ప్రావిన్స్‌కు నిపుణుల బృందాన్ని పంపింది డబ్ల్యూహెచ్​ఓ. విపరీతంగా పెరుగుతున్న కేసులు కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ అధ్యయనానికి బృందాన్ని పంపామని వెల్లడించింది. గత వారంతో పోలిస్తే దక్షిణాఫ్రికాలో కేసులు 105 శాతం పెరిగాయని... ఇది ఆఫ్రికా అంతటా వ్యాపించకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. పరిస్థితిని చాలా నిశితంగా పరిశీలిస్తున్నామన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపింది.

డెల్టా వేరియంట్​ కట్టడికి చేపట్టిన చర్యలను కొనసాగించాలని, దాని ద్వారా ఒమిక్రాన్ వేరియంట్​ను నియంత్రించే వీలుందని పేర్కొంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రయాణ ఆంక్షలు విధించిన పలు దేశాలకు కట్టడి చర్యలు చేపట్టేందుకు సమయం లభిస్తుందని తెలిపింది. అయితే, ప్రతి దేశం కొత్త కేసులను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది.

ఇదీ చూడండి:అమెరికాలో మరిన్ని రాష్ట్రాల్లో ఒమిక్రాన్- దక్షిణాఫ్రికాకు WHO బృందం

Omicron worldwide: ఒమిక్రాన్‌.. ఏ దేశంలోకి ఎప్పుడు?

విస్తరిస్తున్న 'ఒమిక్రాన్​'- భయం గుప్పిట్లో ఆ దేశాలు!

ABOUT THE AUTHOR

...view details