Omicron variant cases in world: ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ గడగడలాడిస్తోంది. కొత్త వేరియంట్ వార్తలతో ప్రజలు వణికిపోతున్నారు. కొవిడ్ అలజడి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అంతర్జాతీయ ఆరోగ్య వ్యవస్థపై ఒమిక్రాన్ ప్రభావం ఎంత ఉంటుంది? అన్న ప్రశ్న ఇప్పుడు అందరిని భయపెడుతోంది. ఈ తరుణంలో మరిన్ని దేశాలు ఒమిక్రాన్ ప్రభావిత ప్రాంతాలుగా మారుతున్నాయి. రోజుకో దేశంలో వైరస్ ఆనవాళ్లు బయటపడుతున్నాయి.
- కొత్త వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థను దక్షిణాఫ్రికా హెచ్చరించకముందే.. తమ దేశంలోకి ఒమిక్రాన్ వ్యాపించి ఉంటుందని నెథర్లాండ్స్ వెల్లడించింది. ఈ నెల 24న కొత్త వేరియంట్ గురించి డబ్ల్యూహెచ్ఓకు దక్షిణాఫ్రికా చెప్పిందని.. అయితే తమ దేశంలో 19 నుంచి 23 మధ్య తీసిన నమూనాల్లో ఒమిక్రాన్‌ను గుర్తించినట్టు నెథర్లాండ్స్ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
- అటు హిందూ మహా సముద్రంలోని ఫ్రాన్స్ ద్వీపమైన రీయూనియన్లోనూ ఒమిక్రాన్ కేసు బయటపడింది. 53ఏళ్ల వ్యక్తికి ఈ కొత్త రకం వైరస్ సోకింది. మొజాంబిక్ నుంచి రోగి దక్షిణాఫ్రికాలో దిగి.. అక్కడి నుంచి రీయూనియన్‌కు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ వ్యక్తి ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నాడు.
- ఆసియాలోని అనేక ప్రాంతాలకు ఒమిక్రాన్ విస్తరిస్తోంది. తాజాగా.. జపాన్‌లోనూ తొలి కేసు వెలుగులోకి వచ్చింది. నమీబియా నుంచి ఆదివారం టోక్యోకు వచ్చిన ఓ 30ఏళ్ల వ్యక్తిలో ఒమిక్రాన్‌ను గుర్తించారు. అతడిని క్వారంటైన్లో పెట్టి చికిత్స అందిస్తున్నారు. విమానంలో మిగిలిన ప్రయాణికులను గుర్తించి.. వారికి పరీక్ష చేసే పనిలో పడ్డారు అధికారులు. ఈ నేపథ్యంలో ప్రయాణ ఆంక్షలను మరింత కఠినతరం చేస్తామని ఆ దేశ చీఫ్ కెబినెట్ సెక్రటరీ హిరోకాజు మట్సూనో వెల్లడించారు.
- జాంబియా నుంచి భారత్‌కు వచ్చిన ఓ వ్యక్తికి ఈ నెల 25న వైరస్ నిర్ధరణ అయ్యింది. 20న జాంబియా నుంచి ముంబయికి ఆ వ్యక్తి వచ్చాడు. అక్కడి నుంచి పుణెకు ట్యాక్సీలో వెళ్లాడు. అతడికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిందా? లేదా? అని తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. జినోమ్ సీక్వెన్సింగ్ కోసం రోగి నమూనాలను ల్యాబ్‌కు పంపించారు.
విజయం సాధించేనా?