Omicron survival on surfaces: ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. రోజుకు లక్షల మందికి అంటుకుంటోంది. ఇందుకు ప్రధాన కారణం.. పలు ఉపరితలాలపై ఎక్కువ కాలం సజీవంగా ఉండటమేనని చెబుతోంది ఓ అధ్యయనం. కరోనా వైరస్ ఇతర రకాలతో పోల్చితే ఒమిక్రాన్ వేరియంట్.. మనుషుల చర్మంపై 21 గంటలకుపైగా, ప్లాస్టిక్ వస్తువులపై 8 రోజులకుపైగా జీవించి ఉంటోందని తేల్చింది.
జపాన్‌లోని క్యోటో ప్రిఫెక్చురల్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు.. వుహాన్‌లో ఉద్భవించిన సార్స్ కోవ్-2 వైరస్‌తో ఇతర అన్ని వేరియంట్లను పోల్చి చూశారు. అవి పర్యావరణంలో సజీవంగా ఉండే సామర్థ్యాన్ని పరిశీలించారు. ఇతర రకాల కన్నా.. ఒమిక్రాన్ వేరియంట్‌కు ఎక్కువ కాలం జీవించే సామర్థ్యం ఉందని తేల్చారు.
వూహాన్లో బయటపడిన రకంతో పోల్చితే.. ఆల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లకు ప్లాస్టిక్, చర్మంపై జీవించేందుకు రెండింతల సామర్థ్యం ఉన్నట్లు నిర్ధరించారు. ఈ అధ్యయనం బయోఆర్షివ్లో ఇటీవలే ప్రచురితమైంది.
"పర్యావరణంలో ఎక్కువ కాలం జీవించే సామర్థ్యమే.. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండేందుకు కారణమవుతోంది. ఇతర వేరియంట్లతో పోల్చితే ఈ సామర్థ్యం ఒమిక్రాన్‌కు ఎక్కువగా ఉంది. ఈ కారణంగానే డెల్టా రకం కంటే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతోంది."
- పరిశోధన కర్త
అధ్యయనం ప్రకారం.. ప్లాస్టిక్ ఉపరితలంపై వైరస్ జీవించే సామర్థ్యం ఒరిజినల్ వేరియంట్ (56 గంటలు), ఆల్ఫా(191.3 గంటలు), బీటా(156.6 గంటలు), గామా(59.3 గంటలు), డెల్టా(114 గంటలు)గా ఉంది. అదే ఒమిక్రాన్ వేరియంట్ ప్లాస్టిక్ వస్తువులపై 193.5 గంటలు సజీవంగా ఉంటోంది.