నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉప ప్రధాని ఈశ్వర్ పోఖ్రియాల్‌ను రక్షణ శాఖ బాధ్యతల నుంచి తప్పించారు. ఆ శాఖను తానే చూడనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు ఓలీ. ఈశ్వర్ పోఖ్రియాల్‌ను ప్రధాని కార్యాలయానికి అనుసంధానం చేశారు. ఫలితంగా ఆయన.. ఏ శాఖ లేని మంత్రిగా కొనసాగనున్నారు. గతంలో ఈశ్వర్ పోఖ్రియాల్ భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించారు. తాజా చర్యతో భారత్‌తో సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి కేపీ శర్మ ఓలీ ఒక ముందడుగు వేసినట్లయింది. నవంబర్ 3న భారత సైనికాధిపతి మనోజ్ ముకుంద్ నరవణె నేపాల్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో అక్కడి మంత్రివర్గంలో ఇలాంటి పరిణామం జరగడం గమనార్హం.
ఘాటుగా స్పందించిన పోఖ్రియాల్..
కైలాస్ మానస సరోవర్ యాత్రికుల కోసం చైనా సరిహద్దులోని లిపులేఖ్ వరకు 80 కిలోమీటర్ల రహదారిని భారత్ గత మే నెలలో ప్రారంభించింది. దీనిని నేపాల్ తీవ్రంగా వ్యతిరేకించింది. కొత్త సరిహద్దులతో మ్యాప్‌ను విడుదల చేసింది. దీని వెనుక చైనా హస్తముందని మే నెలలో జనరల్ నరవణె అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా దశాబ్దాలుగా భారత్ ఆర్మీలో అంతర్భాగమై దేశ రక్షణ కోసం పని చేస్తున్న నేపాల్ సైనికుల మనోభావాలను ఆ దేశం దెబ్బతీసిందన్నారు. దీనిపై నేపాల్ రక్షణ మంత్రిగా ఈశ్వర్ పోఖ్రియాల్ తీవ్రంగా స్పందించారు. నరవణె వ్యాఖ్యలతో ఇక నుంచి గూర్ఖా సైనికులు.. ఉన్నతాధికారులు చెప్పిన మాటలను వినబోరని చెప్తూ.. సమస్యను రాజకీయం చేసే ప్రయత్నం చేశారు.