నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి మరోసారి భారత్‌పై విమర్శలు గుప్పించారు. తనను పదవి నుంచి తప్పించేందుకు భారత దౌత్య కార్యాలయం కుట్ర చేస్తోందని తనకు అలవాటైన ధోరణిలోనే మరోసారి ఆరోపణలు చేశారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తననేమీ చేయలేరని ఉద్ఘాటించారు.
రాజీనామా డిమాండ్లతో..
భారత ప్రాంతాలను కలుపుతూ రూపొందించిన రేఖాచిత్రపటాలకు నేపాల్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. ప్రధాని ఓలి ప్రమేయంతోనే ఇది జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నేపాల్ కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని ప్రచండ ఏకంగా పార్టీని రెండుగా చీలుస్తానని బెదిరించారు.
'దౌత్య కార్యాలయం కుట్రలు..'
కాఠ్‌మాండూలోని ఓ హోటల్‌లో తనను పదవి నుంచి తొలగించేందుకు కుట్ర జరుగుతోందని కేపీ ఓలి ఆదివారం ఆరోపించారు. ఇందులో ఒక ఎంబసీ కీలకంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు నేపాల్‌లోని భారత దౌత్య కార్యాలయం కుట్ర పన్నుతోందని విమర్శించారు. భారత ప్రాంతాలను చూపుతూ నేపాల్ రేఖాచిత్రపటాల సవరణ బిల్లును ప్రవేశపెట్టినప్పటి నుంచి తనపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.
'నన్ను పదవి నుంచి తొలగించేందుకు బహిరంగ పోటీ జరుగుతోంది. నేపాల్ జాతి అంత బలహీనమైంది కాదు. ఒక రేఖాచిత్రపటం ముద్రించినందుకు ప్రధానమంత్రికి ఉద్వాసన పలుకుతారని ఎవరూ అనుకోరు' అని ఓలి అన్నారు. గతంలోనూ ఆయన భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. తమ దేశంలో కరోనా వైరస్‌కు కారణం భారతేనని ఆరోపించారు.
ఇదీ చూడండి:వెనక్కి తగ్గిన నేపాల్.. క్యాంప్, వాచ్ టవర్ తొలగింపు
ఓలి... భారత్‌కే వ్యతిరేకమా? రాజీనామా చేయ్!