న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డర్న్ తొలిసారి తన నిశ్చితార్థంపై పెదవి విప్పారు. ఈస్టర్ సెలవుల్లో చిరకాల మిత్రుడు గేఫర్డ్తో నిశ్చితార్థమైందని స్పష్టం చేశారు. వివాహ ప్రణాళికలు ఇంకా మొదలు పెట్టలేదని వెల్లడించారు. పది నెలల 'నివి'... వీరిద్దరి ప్రేమకు చిహ్నం.
జెసిండా మధ్య వేలుకున్న ఉంగరాన్ని విలేకరులు శుక్రవారం గుర్తించారు. అప్పటి నుంచి జెసిండా- గేఫర్డ్ నిశ్చితార్థంపై ఊహాగానాలు వెల్లువెత్తాయి. మిత్రులిద్దరికీ నిశ్చితార్థం జరిగిందని ప్రధాని కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.
ముకోటహి కొండ అందాల నడుమ...
గేఫర్డ్ తన మనసులో భావాలను వ్యక్తపరిచిన విధానాన్ని వెల్లింగ్టన్లో జరిగిన మీడియా సమావేశంలో పంచుకున్నారు జెసిండా.
"మేము మహియాలో ఉన్నాము. ముకోటహి కొండపై కూర్చున్నాము. ఆ కొండ ఎంతో అందంగా ఉంటుంది. నేను, క్లార్క్, ఓ రక్షణాధికారి ఉన్నాము. కొంతమంది మహియా స్థానికులూ ఉన్నారు. అదే సమయంలో క్లార్క్ నాకోసం తెచ్చిన చాకొలెట్ను తినడానికి ఓ శునకం ప్రయత్నించింది. ఆ సన్నివేశం ఎంతో రొమాంటిక్గా అనిపించింది."
--- జెసిండా ఆర్డర్న్, న్యూజిలాండ్ ప్రధాని
ఆ సమయంలో పక్కనే ఉన్న రక్షాణాధికారికి అసలు ఏం జరుగుతోందో అర్థంకాలేదని, గేఫర్డ్ ప్రతిపాదన ఆశ్చర్యానికి గురిచేసిందని జెసిండ్ నవ్వుతూ తెలిపారు. చూపుడు వేలుకు పట్టకపోవడం వల్లే మధ్య వేలుకు ఉంగరం ధరించినట్టు న్యూజిలాండ్ ప్రధాని తెలిపారు.
న్యూజిలాండ్ మసీదుల్లో జరిగిన ఉగ్రదాడుల అనంతరం 38 ఏళ్ల ప్రధానిగా జెసిండా ఆర్డర్న్ చేపట్టిన చర్యలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. 41 ఏళ్ల గేఫర్డ్ ఓ టీవీ షోకు వ్యాఖ్యాతగా పనిచేస్తున్నారు.
ఇదీ చూడండి: సార్వత్రిక సమరం ఐదో దశ సమాప్తం