చైనాలో ఇప్పటివరకు 17మందిని బలిగొని 550మందికి సోకిన మహమ్మారి వైరస్ కరోనా... ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. చైనాకే పరిమితం కాకుండా ఈ వ్యాధి హంకాంగ్, సింగపూర్, థాయ్లాండ్, జపాన్లకు పాకింది. అసలు ఈ వ్యాధి మూలాలు ఏంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ మూలాలను కనుగోనేందుకు పరిశోధనలు చేపట్టింది చైనాలోని పెర్కింగ్ ఆరోగ్య విశ్వవిద్యాలయం.
వన్యప్రాణులు, పాములు, గబ్బిలాల నుంచే కరోనా వైరస్ మనుషులకు వ్యాప్తి చెంది ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. 2019 డిసెంబరు మధ్యకాలంలో కరోనా మొదటి కేసు నమోదైంది. వ్యాధి బారిన పడిన వారికి సంబంధించిన వివరాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చారు పరిశోధకులు.
కరోనా వైరస్ తొలి కేసుకు సంబంధించిన జన్యు విశ్లేషణపై పరిశోధనలో భాగంగా.. భౌగోళికంగా ఇతర జీవుల్లో ఉన్న భిన్న కరోనా వైరస్లతో ప్రస్తుత వైరస్ను పోల్చిచూశారు. ఇది గబ్బిలాలు, ఇతర జీవి కలయికతో పుట్టుకొచ్చినట్లు గుర్తించారు. కొత్త వైరస్ ఇంతకు మందు ఏ జీవిలో ఉందో నిర్ధరించడం చాలా క్లిష్టమని పేర్కొన్నారు. రెండు జీవుల కలయిక వల్ల రూపాంతరం చెందినందు వల్ల కనుగొనడం కష్టమన్నారు.