పంజ్‌షేర్ వ్యాలీపై దండెత్తిన తాలిబన్లకు(Taliban Panjshir) భారీ షాక్ తగిలింది. తాలిబన్ల సీనియర్ కమాండర్ ఫసీయుద్దీన్ మౌల్వీని రెసిస్టెన్స్ ఫోర్సెస్ (ఎన్‌ఆర్‌ఎఫ్ఏ) మట్టుబెట్టాయి. ఈశాన్య అఫ్గానిస్థాన్ గ్రూప్ చీఫ్ గానూ మౌల్వీ విధులు నిర్వహిస్తున్నారు. ఈ పోరులో ఆయనకు రక్షణగా ఉన్న మరో 13 మందిని కూడా రెసిస్టెన్స్ ఫోర్సెస్ హతమార్చినట్లు సమాచారం.
అఫ్గాన్‌ను ఆక్రమించుకన్న తాలిబన్లు(Afghan Taliban).. కొరకరాని కొయ్యగా మిగిలిన పంజ్‌షేర్‌పై(Panjshir Valley) ప్రస్తుతం దాడికి పాల్పడుతున్నారు. కొద్దిరోజులుగా సాగుతున్న ఈ పోరులో రెండు దళాలకు చెందిన అనేక మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. 700 మంది దుష్టమూకలను హతమార్చినట్లు రెసిస్టెన్స్ ఫోర్సెస్ వర్గాలు పేర్కొన్నాయి. తమ ప్రియతమ సోదరులను కూడా కోల్పోయినట్లు వెల్లడించాయి. ఎన్‌ఆర్‌ఎఫ్ఏ అధికార ప్రతినిధి అధిపతి ఫాహిమ్ దాస్తీతోపాటు అహ్మద్ మసూద్ మేనల్లుడు, జనరల్ అబ్దుల్ వదూద్ జోర్ వీరమరణం పొందినట్లు తెలిపాయి. కాగా పంజ్‌షేర్ లోయను పూర్తిస్థాయిలో హస్తగతం చేసుకొన్నామని తాలిబన్లు(Taliban) సోమవారం ప్రకటించారు.