ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తోంటే.. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ ఏమాత్రం లెక్కచేయట్లేదు. తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. కరోనా కాలంలోనూ మూడు వ్యూహాలు.. ఆరు క్షిపణి పరీక్షలతో తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్నారు.
రక్షణ రంగానికి సంబంధించి కీలక వ్యూహాలు అమలుచేస్తున్నారు కిమ్. క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా కొరియాలో అత్యున్నత నిర్ణాయక మండలి అయిన రాజ్య వ్యవహారాల కమిషన్ (ఎస్ఏసీ)ను పునర్ వ్యవస్థీకరించారు కిమ్.
ఇదే తొలిసారి..
దేశానికి సంబంధించి అత్యున్నత నిర్ణయాలు తీసుకునే ఈ కమిషన్‌లోని 13 మంది సభ్యుల్లో ఐదుగురిని మార్చినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద ఎత్తున ఎస్ఏసీ సభ్యులను మార్చటం ఇదే తొలిసారని విశ్లేషకులు చెబుతున్నారు.
రక్షణకు బడ్జెట్ పెంపు..
రక్షణ రంగం బడ్జెట్‌ను ఈ ఏడాది భారీగా పెంచింది కిమ్ ప్రభుత్వం. దేశ బడ్జెట్ లో 15.9 శాతం రక్షణకే కేటాయించింది. గతేడాది దేశ వ్యవహారాల్లో తీవ్రమైన పొరపాట్లు జరిగినట్లు కేబినెట్ గుర్తించింది. దేశ ఆర్థిక లక్ష్యాలను చేరటంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారని.. ఫలితంగా పునర్ వ్యవస్థీకరణ చేపట్టినట్లు తెలుస్తోంది.
మాస్కులు లేకుండానే..
సభ్యుల పునర్ వ్యవస్థీకరణపై ఉత్తర కొరియా పార్లమెంటుగా పిలిచే సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశానికి కిమ్ హాజరైనట్లు ఎంలాంటి ధ్రువీకరణ లేదు. కానీ, పార్లమెంటుకు వచ్చిన వందలాది చట్ట సభ్యులు సామాజిక దూరం పాటించలేదు. మాస్కులు ధరించకుండా పక్కపక్కనే కూర్చున్నారు. వారంతా అంత ధైర్యం ఉండడానికి కారణం.. ఆ దేశంలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడమేనట.
చైనాలో కరోనా విజృంభిస్తున్న వేళ.. ముందుగానే కిమ్ అప్రమత్తమయ్యారు. సొంత ప్రజలు, విదేశీయులతో పాటు దౌత్యవేత్తలను నిర్బంధంలో ఉంచారు. దేశమంతా క్రిమిసంహారక మందులతో శుద్ధి చేయించారు.
కరోనా నియంత్రణలో చాలా ముందున్నామని ఉత్తర కొరియా పార్లమెంటు కూడా ప్రకటించింది. ఒకవేళ కొరియాలో వైరస్ విజృంభిస్తే.. ఆ దేశంలో అధ్వానమైన వైద్య వ్యవస్థ కారణంగా వేలాది మంది మరణించే అవకాశం ఉన్నందునే కిమ్ కఠిన చర్యలకు సిద్ధమయ్యారని నిపుణుల అంచనా.
మళ్లీ తెరపైకి కిమ్ సోదరి..
అమెరికాతో చర్చల అనంతరం కొన్నాళ్లుగా అజ్ఞాతంలో ఉన్న కిమ్ సోదరి కిమ్ యో జోంగ్.. మళ్లీ ప్రభుత్వంలో క్రియాశీలకంగా మారారు. తాజాగా చేసిన ఎస్ఏసీ పునర్ వ్యవస్థీకరణలో కిమ్ యో జోంగ్కు సెంట్రల్ కమిటీ పొలిటికల్ బ్యూరోలో సభ్యురాలిగా ఎంపిక చేశారు కిమ్.
కిమ్ ఆధ్వర్యంలో..
కిమ్ నేతృత్వంలో ఉత్తర కొరియా భారీగా అణ్వాయుధ సంపత్తిని పోగు చేసుకుంటోంది. అమెరికాను చేరుకోగల క్షిపణి పరీక్షలు నిర్వహిస్తోంది. ఫలితంగా ఉత్తరకొరియాపై ఐరాస ఆంక్షలు విధించింది. ఆంక్షల ఉపశమనం కోసం అమెరికా, ఉత్తర కొరియా మధ్య జరిగిన హనొయి సదస్సు తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాల్లో ప్రతిష్టంభన ఏర్పడింది.
ఇదీ చూడండి:అమెరికాలో కరోనా రివర్స్ గేర్- చైనాలో మళ్లీ విజృంభణ