తమ దేశానికి సంబంధించిన ఆత్మ రక్షణ చర్యలపై ఐరాస భద్రతా మండలిలో ఎలాంటి చర్చ జరిగినా సంహించబోమని హెచ్చరించింది ఉత్తర కొరియా. ఇటీవల జరిపిన క్షిపణి ప్రయోగాన్ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
'మా క్షిపణి ప్రయోగాలపై చర్చిస్తే ఊరుకోం' - భద్రతా మండలి చర్చలపై ఉత్తరకొరియా హెచ్చరికలు
తమ క్షిపణి ప్రయోగాలపై ఐరాస భద్రతా మండలిలో చర్చిస్తే సహించేది లేదని హెచ్చరించింది ఉత్తర కొరియా. క్షిపణి ప్రయోగం ఐరాస తీర్మానాలకు విరుద్ధమని ఆరోపిస్తూ భద్రతా మండలిలో చర్చకు పిలుపునిచ్చిన పలు ఐరోపా దేశాలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది.
'మా ఆత్మ రక్షణ చర్యలపై చర్చిస్తే సహించం'
గత వారం ఉత్తరకొరియా జరిపిన క్షిపణి ప్రయోగంపైమంగళవారం చర్చించేందుకు భద్రతా మండలి సమావేశానికి పిలుపునిచ్చాయి బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు. ఐరాస తీర్మానాలను కిమ్ ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపించాయి.
ఇలాంటి సమావేశాల వల్ల తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలన్న కోరిక పెరుగుతుందని ఐరాసలోని ఉత్తర కొరియా రాయబారి కిమ్ సోంగ్ వ్యాఖ్యానించారు. అమెరికాతో అణు చర్చలను తెగతెంపులు చేసుకున్న రెండు రోజుల అనంతరం ఉత్తర కొరియా నుంచి ఈ హెచ్చరికలు వెలువడ్డాయి.