అణు కార్యకలాపాల విషయంలో కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియా ప్రభుత్వం(kim Jong Un Government).. ప్రపంచ దేశాలకు మళ్లీ సవాళ్లు విసురుతోంది. చాలా నెలల విరామం తర్వాత .. సుదూర లక్ష్యాలను ఛేదించే(లాంగ్ రేంజ్) ఓ క్రూయిజ్ క్షిపణిని(Long Range Cruise Missile) శని, ఆదివారాల్లో ఆ దేశం విజయవంతంగా ప్రయోగించింది. అణుకార్యకలాపాల విషయంలో అమెరికాతో చర్చలకు విముఖత వ్యక్తం చేస్తున్న ఉత్తర కొరియా.. ఈ తాజా ప్రయోగం చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.
'ఇది వ్యూహాత్మక ఆయుధం'
రెండేళ్ల పాటు శ్రమించి ఈ క్షిపణిని అభివృద్ధి చేసినట్లు ఉత్తర కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ సోమవారం తెలిపింది. ఈ క్షిపణి.. 1,500 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని చెప్పింది. ఈ ప్రయోగానికి సంబంధించిన ఫొటోలను ప్రచురించింది. ఈ క్షిపణిని తమ వ్యూహాత్మక ఆయుధంగా ఉత్తర కొరియా ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. ఇది తమ సైనికుల అమ్ముల పొదిలో చేరిన మరో బలమైన అస్త్రమని చెప్పారు.