North Korea Missile Test: క్షిపణి ప్రయోగాల్లో తగ్గేదేలే అంటోంది ఉత్తర కొరియా. నెల రోజుల వ్యవధిలోనే మూడో పరీక్ష నిర్వహించింది. ఈ సారి రైలు నుంచి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు తెలుస్తోంది. అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తున్నందుకు అమెరికా ఇటీవలే కొత్త ఆంక్షలు విధించిన నేపథ్యంలో.. తాము ఎవరికీ బెదరబోమనే సంకేతాన్ని ఇచ్చేందుకే కిమ్ దేశం శుక్రవారం ఈ పరీక్ష చేపట్టినట్లు నిపుణులు చెబుతున్నారు.
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం నిర్వహించిందని, కానీ అది ఎక్కడ ల్యాండ్ అయ్యిందో చెప్పలేమని దక్షిణ కొరియా తెలిపింది. ఇంతకుమించి మరే వివరాలు వెల్లడించలేదు.
ఉత్తర కొరియా ప్రయోగించింది బాలిస్టిక్ క్షిపణి అయి ఉండవచ్చని జపాన్ ప్రధాని కార్యాలయం, ఆ దేశ రక్షణ శాఖ చెప్పింది. ఇప్పటికే అది ల్యాండ్ అయి ఉండవచ్చని, తీరప్రాంత రక్షణ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించింది.