అణు చర్చల పునఃప్రారంభానికి కొద్దిరోజుల ముందు ఉత్తర కొరియా మరోసారి క్షిపణి పరీక్ష నిర్వహించినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. ఈ క్షిపణి గరిష్ఠంగా 910 కిలోమీటర్లు ఎత్తులో తూర్పు దిశగా 450కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు తెలిపింది.
ఈ క్షిపణి జలాంతర్గామి నుంచి ప్రయోగించే పక్కక్సొంగ్ మోడల్‌కు చెందినదై ఉండొచ్చని దక్షిణ కొరియా అభిప్రాయపడింది. 2016 ఆగస్టులో తొలిసారి ఈ శ్రేణి క్షిపణిని పరీక్షించింది కిమ్ సర్కార్.
ఒక్క రోజులోనే...
ఈ వారాంతంలో అణు చర్చలు జరుపుతామని మంగళవారమే ప్రకటించాయి అమెరికా, ఉత్తర కొరియా. అనూహ్యంగా చర్చలకు ముందే మరోసారి క్షిపణి ప్రయోగం జరగడం చర్చనీయాంశమైంది.
అమెరికా, దక్షిణ కొరియాపై దౌత్యపరంగా ఒత్తిడి తీసుకురావాలనే లక్ష్యంతోనే ఉత్తర కొరియా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అప్రమత్తం...
క్షిపణి పరీక్షను దక్షిణ కొరియా తప్పుబట్టింది. కొరియా భూభాగంలో ఉద్రిక్తతలకు దారితీసే పనులు మానుకోవాలని కిమ్‌కు హితవు పలికింది. పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది.
ఇదీ చూడండి: కమ్యూనిస్ట్ రాజ్యం అవతరణ రోజే డ్రాగన్‌కు తలవంపులు!