North Korea long range missile: కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియా కవ్వింపులు తీవ్రం చేసింది. ఆంక్షలతో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశం.. అమెరికాపై ఒత్తిడి పెంచడంలో భాగంగా క్షిపణి పరీక్షలతో విరుచుకుపడుతోంది. ఆదివారం మరోసారి మిసైల్ పరీక్షలు నిర్వహించింది. గత సంవత్సర కాలంలో ప్రయోగించిన అత్యంత శక్తిమంతమైన క్షిపణి ఇదేనని భావిస్తున్నారు.
North Korea missile test 2022
ఉత్తర కొరియా ప్రయోగించిన ఈ క్షిపణి సముద్రంలో పడిపోయిందని జపాన్ ప్రధాని, రక్షమంత్రి కార్యాలయం పేర్కొన్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం.. క్షిపణి రెండు వేల కిలోమీటర్లు ఎత్తుకు చేరి.. 800 కిలోమీటర్ల మేర ప్రయాణించి ఉంటుందని తెలిపాయి. 30 నిమిషాల పాటు ప్రయాణించి తమ దేశ అధీనంలోని సముద్ర జలాల్లో పడిపోయాయని జపాన్ కేబినెట్ ముఖ్య కార్యదర్శి హిరోకాజు మత్సునో తెలిపారు.
2017 తర్వాత ఉత్తర కొరియా ప్రయోగించిన అత్యంత సుదీర్ఘ శ్రేణి క్షిపణి ఇదేనని తెలుస్తోంది. 2017లో మూడు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అమెరికాలోని భూభాగాలను లక్ష్యంగా చేసుకొని ఇవి దాడి చేయగలవు.
North Korea powerful missile test:
'జపాన్ అధికారుల వివరాల ప్రకారం చూస్తే.. ఉత్తర కొరియా అత్యంత శక్తిమంతమైన క్షిపణిని ప్రయోగించినట్లు తెలుస్తోంద'ని రక్షణ రంగ నిపుణుడు లీ చూన్ గ్యూన్ తెలిపారు. 'తాజా మిసైల్ లక్షణాలు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలకు దగ్గరగా ఉన్నాయి. దీర్ఘశ్రేణి క్షిపణి ప్రయోగాలపై ఇప్పటివరకు విధించుకున్న నిషేధాన్ని ఉత్తర కొరియా ఎత్తివేసిందని అర్థమవుతోంది' అని వివరించారు.
US and North Korea nuclear conflict
రెండు స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన మూడు రోజులకే తాజా ప్రయోగం చేపట్టడం గమనార్హం. జనవరి నెలలో చేపట్టిన ఏడో ప్రయోగం ఇది. అమెరికా, ఉత్తర కొరియా మధ్య అణు చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో అగ్రరాజ్యంపై ఒత్తిడి పెంచేందుకు కిమ్ క్షిపణి ప్రయోగాలు ఉద్ధృతం చేశారని విశ్లేషకులు చెబుతున్నారు. సీనియర్ పార్టీ నేతలతో కలిసి జనవరి 20న నిర్వహించిన సమావేశంలోనూ అధికారులకు ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. 2018లో నిలిపివేసిన అణు కార్యక్రమాలను పునఃప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి:పాక్ కోసం చైనా అంతరిక్ష కేంద్రం- ఏడాదిలోపే..!