ఉభయ కొరియా దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. దాయాది దేశాలు రెండూ కవ్వించుకున్నాయి. దక్షిణ కొరియా జలాంతర బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించగా, ఉత్తర కొరియా.. స్వల్ప రేంజ్ కలిగిన బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.
తొలిసారి అండర్వాటర్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా అధ్యక్ష భవనం బుధవారం మధ్యాహ్నం ప్రకటన చేసింది. దేశీయంగా తయారు చేసిన ఈ క్షిపణిని మూడు వేల టన్నుల బరువైన సబ్మెరైన్ నుంచి ప్రయోగించినట్లు తెలిపింది. ప్రణాళిక ప్రకారం నిర్దిష్ట దూరాన్ని చేరిన తర్వాత లక్ష్యాన్ని క్షిపణి ఛేదించిందని స్పష్టం చేసింది. ఆత్మరక్షణ కోసం, విదేశాల నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కోవడానికి ఈ ఆయుధం ఉపయోగపడుతుందని అధ్యక్ష భవనం పేర్కొంది.
అయితే, అంతకుముందు కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియా రెండు స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వీటిని దక్షిణ కొరియా గుర్తించింది. సెంట్రల్ నార్త్ కొరియా నుంచి వీటిని ప్రయోగించారని తెలిపింది. క్షిపణులు 800 కి.మీ ప్రయాణించి కొరియా ద్వీపకల్పానికి, జపాన్ అంతర్జాతీయ జలాలకు మధ్య పడిపోయాయని వెల్లడించింది.
జపాన్, అమెరికా స్పందన
ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలపై అమెరికా, జపాన్ స్పందించాయి. ఘటనను ఖండించిన అగ్రరాజ్యం.. తమ సిబ్బందికి, కూటమి సైన్యానికి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేసింది.