ఉత్తర కొరియా మరోసారి తన వక్రబుద్ధిని చూపిందని వ్యాఖ్యానించింది దక్షిణ కొరియా. ప్యాంగ్యాంగ్ కేంద్రంగా రెండు క్షిపణులను తమ దేశంపై ప్రయోగించిందని ఆరోపించింది. అయితే అవి అణు క్షిపణులో కాదో దక్షిణ కొరియా స్పష్టంగా చెప్పలేదు. కిమ్ బృందం మరోసారి దాడులకు తెగిస్తే మాత్రం.. ప్రతిఘటించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు దక్షిణకొరియా సైనికాధికారులు హెచ్చరించారు.
ఉత్తర కొరియాలో అణ్వాయుధ ప్రయోగాలపై అంతర్జాతీయంగా అనేక ఆంక్షలు ఉన్నాయి. ఇటీవలే అణునిరాయుధీకరణ దిశగా అడుగులేస్తామని కిమ్ బృందం.. అమెరికాతో చర్చలు జరిపినప్పటికీ, అవి ఆచరణలో మాత్రం కనిపించడం లేదని మండిపడింది దక్షిణ కొరియా. అందుకే ఉత్తర కొరియా అణ్వాయుధ ప్రయోగాలను పూర్తిగా విస్మరించేలా ఏడాది చివరినాటికి కొత్త పథకంతో ముందుకు రావాలని అమెరికాను కోరారు.
"ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ , అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉండటం ప్రశంసనీయమే.. కానీ, ప్రతిదానికీ ఓ పరిమితి ఉంటుంది" అని దక్షిణ కొరియా తెలిపింది.