తమ దేశ భద్రతా దళాల చేతిలో హతమైన అధికారి మృతదేహాన్ని వెతికేందుకు.. వివాదాస్పద సముద్ర జలాల్లోకి దక్షిణ కొరియా నౌకలను పంపించినట్లు ఆరోపించింది ఉత్తర కొరియా. అక్రమ చొరబాట్లు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచుతాయని హెచ్చరించింది. అలాంటి చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని హితవు పలికింది కిమ్ సర్కార్.
"పశ్చిమ సముద్రంలోని సైనిక సరిహద్దు రేఖ వెంట చొరబాట్లను వెంటనే నిలిపివేయాలని దక్షిణ కొరియాను కోరుతున్నాం. అది ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ఇది మరో భయంకరమైన ఘటనకు దారితీసే ప్రమాదం ఉన్నందున తగిన అప్రమత్తత అవసరం."
- ఉత్తర కొరియా అధికారి.
ఉత్తర కొరియా ఆరోపణలను ఖండించింది దక్షిణ కొరియా. తమ అధికారి మరణంపై ఇరు దేశాల మధ్య వ్యత్యాసాలను పరిష్కరించడానికి సంయుక్త దర్యాప్తు చేపట్టాలని ప్రతిపాదించింది. మృతదేహం కోసం వెతికినట్లు పేర్కొన్న దక్షిణ కొరియా... చొరబాట్లకు పాల్పడలేదని తెలిపింది.
ఈ అంశంపై దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే యిన్.. తన జాతీయ భద్రత మండలితో ఆదివారం సమావేశమయ్యారు. కిమ్ క్షమాపణలపై సానుకూలంగా వ్యవహరించటం, అధికారి అంశంలో జరిగిన దానిపై సంయుక్త దర్యాప్తును కోరటంపై చర్చించినట్లు తెలిసింది. అలాగే.. ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు సైనిక హాట్‌లైన్‌ను పునరుద్ధరించాలని కోరుకుంటున్నట్లు సీనియర్ అధికారి తెలిపారు.
కిమ్ క్షమాపణలు..
దక్షిణ కొరియాకు చెందిన ఒక ప్రభుత్వం అధికారిని ఉత్తర కొరియా కాల్చి చంపింది. ఆ తర్వాత మృతదేహాన్ని దహనం చేసింది. అయితే.. ఆ అధికారిని పొరపాటున హత్యచేసినట్లు పేర్కొంటూ ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తమకు క్షమాపణలు చెప్పినట్లు ప్రకటించింది దక్షిణ కొరియా.
ఓ శత్రు దేశానికి కిమ్ క్షమాపణలు చెప్పటం ఇదే తొలిసారి. కిమ్ క్షమాపణ ప్రత్యర్థుల మధ్య ఉత్రిక్తతలు పెరిగే ప్రమాదాన్ని తగ్గించటంలో సహాయపడగా.. అధికారి మరణాన్ని నిరోధించటంలో విఫలమైన అధ్యక్షుడు మూన్‌పై రాజకీయ దాడి పెరిగేలా చేసింది.
ఇదీ చూడండి:శత్రు దేశానికి కిమ్ జోంగ్ క్షమాపణలు