ఓ దేశ ప్రధానమంత్రి రెస్టారెంట్‌కు వెళ్లి, అక్కడ ఖాళీ లేక తిరిగి వెళ్లిపోయిన ఘటన గురించి మీరెప్పుడైన విన్నారా? కనీసం అలా జరుగుతుందని కలగన్నారా? కానీ అదే జరిగింది.
కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం లాక్డౌన్ నిబంధనలు అమలు చేసిన న్యూజిలాండ్... తరువాత కొన్ని సడలింపులు ఇచ్చింది. ఈ సడలింపులు అమల్లోకి వచ్చిన రెండు రోజుల తరువాత ప్రధాని జెసిండా ఆర్డెర్న్, ఆమె కాబోయే భర్త క్లార్క్ గేఫోర్డ్... వెల్లింగ్టన్లోని ఆలివ్ అనే రెస్టారెంట్‌కు వెళ్లారు. అయితే అక్కడ ఖాళీ లేకపోవడం వల్ల రెస్టారెంట్ సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. దీనితో చేసేది లేక జెసిండా, ఆమె స్నేహితుడు క్లార్క్ తిరిగివెళ్లిపోయారు.
రెస్టారెంట్ ఘటనపై ప్రధానమంత్రి కార్యాలయ ప్రతినిధిని ప్రశ్నించినప్పుడు... కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎవరైనా భౌతిక దూరం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రధాని జెసిండా కూడా అదే పని చేశారని ఆయన పేర్కొన్నారు.
మినహాయింపులు లేవు..
న్యూజిలాండ్‌లో లాక్డౌన్ నిబంధనలకు కొన్ని సడలింపులు ఇచ్చినా.. భౌతిక దూరం నియమాలు మాత్రం కచ్చితంగా పాటించాల్సిందే. ఇద్దరు వ్యక్తుల మధ్య కనీసం ఒక మీటరు(మూడు అడుగులు) దూరంఉండాలి. ఈ నేపథ్యంలో రెస్టారెంట్లు తమ సీటింగ్‌ను పరిమితం చేశాయి.
ట్విట్టర్లో ముచ్చట్లు...
ఈ విషయం ట్విట్టర్లో హాట్‌టాపిక్‌గా మారింది.