ప్రపంచవ్యాప్తంగా వైరస్ భయాలు, లాక్డౌన్ ఆంక్షల మధ్య రంజాన్ జరుపుకుంటున్నారు ప్రజలు. చాలా వరకు ప్రభుత్వాలు మసీదుల్లో ప్రార్థనలపై నిషేధం విధించడం వల్ల ఇళ్లలోనే వేడుకలు నిర్వహించుకుంచుటున్నారు.
అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేసియా, టర్కీ, ఇరాన్, జోర్డాన్ దేశాల్లో ఇప్పటికే వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన ఆంక్షల నడుమ రంజాన్‌ను జరుపుకుంటున్నారు. లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన ప్రాంతాల్లోనూ ప్రజలు బయటకు రావడానికి వెనకాడుతున్నారు.
అయితే సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే ఇండోనేసియాలోని అచేహ్ రాష్ట్రంలో మాత్రం బహిరంగ వేడుకలు నిర్వహించుకున్నారు ప్రజలు. ఇస్లామిక్ చట్టం అమలులో ఉన్న ఈ రాష్ట్రంలోని ప్రజలు.. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
మలేసియాలో రంజాన్ రోజు వేల మందితో కలిసి నిర్వహించుకునే ఓపెన్ హౌస్ సంప్రదాయాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. 20 మందికి మించకుండా ఇంట్లోనే ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలని సూచించింది. మసీదుల్లో ఒకసారి 30 మంది మాత్రమే ప్రార్థనల్లో పాల్గొనాలని స్పష్టం చేసింది.
వైరస్ ప్రబలుతున్నా వేల మందితో...
కరోనా వైరస్ ఉద్ధృతి నేపథ్యంలోనే పాకిస్థాన్‌లో భారీ స్థాయిలో ఈద్ నిర్వహించుకున్నారు ప్రజలు. ప్రార్థనా స్థలాలను మూసేయాలన్న వైద్య నిపుణుల సూచనలను బేఖాతరు చేస్తూ.. మసీదులను తెరిచే ఉంచింది ఇమ్రాన్ ప్రభుత్వం. దీంతో పెద్ద సంఖ్యలో ముస్లింలు ఒకే చోట చేరి ప్రార్థనలు చేశారు. వ్యక్తిగత దూరం పాటించకుండా వేడుకలు చేసుకున్నారు. కరాచీలో జరిగిన బహిరంగ ప్రార్థనలో వెయ్యి మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు.