చైనా పట్ల క్వాడ్ కూటమి దేశాలు అనుసరిస్తున్న విధానాలపై చైనా మండిపడింది. సిద్ధాంతాల పేరుతో ఆయా దేశాలు చిన్న కూటములను ఏర్పాటు చేసుకోవటం ప్రపంచానికి ప్రమాదకరమని ధ్వజమెత్తింది. తమ సరిహద్దు దేశాలకు తప్పుడు సందేశాన్ని అందిస్తూ.. తమపై విభేదాలు సృష్టించేందుకు యత్నిస్తున్నాయని మండిపడింది. ఆయా దేశాలు తమతో ఉన్న సిద్ధాంత పక్షపాతాలు, ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని వీడితే ప్రాంతీయ దేశాల మధ్య శాంతి నెలకొంటుందని చైనా విదేశాంగ ప్రతినిధి జావో లిజియాన్ స్పష్టం చేశారు.
"'చైనాతో ముప్పు' అనే అంశంతో కొన్ని దేశాలు మా దేశంపై దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలా చేసి ప్రాంతీయ దేశాల్లో తమపై విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. వారి చర్యలను స్వాగతించం. ఇవి ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తాయి. దేశాల మధ్య పరస్పర భాగస్వామ్యం, నమ్మకంతోనే అభివృద్ధి సాధ్యం."
-జావో లిజియాన్, చైనా విదేశాంగ ప్రతినిధి