పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. భారత్‌లో అంతర్భాగమైన కశ్మీర్‌ను పదే పదే వివాదాస్పదం చేయాలని ప్రయత్నిస్తోంది. తాజాగా కశ్మీర్ వివాదం పరిష్కారమైతే అణ్వాయుధాల అవసరమే ఉండదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పాక్ ప్రధాని తాను అణ్వాయుధాలకు పూర్తి వ్యతిరేకమని డాంబికాలు పలికారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి అమెరికా జోక్యం చేసుకోవాలన్న ఇమ్రాన్.... ఆ దేశ మాజీ అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వం వహిస్తానని ప్రకటించిప్పుడు తాను సంసిద్ధం వ్యక్తం చేసినట్లు గుర్తుచేశారు. అయితే కశ్మీర్ అంశంపై.. మూడో వ్యక్తి ప్రమేయాన్ని భారత్ గట్టిగా వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు.
ఆత్మరక్షణ కోసమే..
కశ్మీర్ వివాదంపై స్పష్టత వస్తే.. ఇరు దేశాల ప్రజలు స్నేహపూర్వకంగా జీవించే అవకాశం ఉంటుందని ఇమ్రాన్ అన్నారు. పాక్ అత్యంత వేగంగా అణ్వాయుధాలను సమీకరిస్తోందంటూ నిఘా వర్గాల నివేదికపై స్పందించిన ఇమ్రాన్.. ఆ సమాచారం వారికి ఎక్కడ నుంచి వస్తుందో తనకు తెలియదన్నారు. అణ్వాయుధాలు.. కేవలం ఆత్మరక్షణ కోసమే ఉన్నట్లు చెప్పారు.