కిమ్ జోంగ్ ఉన్ పాలనలో ఉన్న ఉత్తర కొరియా నియంతృత్వానికి చిరునామా. కిమ్ మాటే అక్కడ శాసనం. ఈ తరహా వ్యవహారంతో భవిష్యత్ తరాల నుంచి కూడా వ్యతిరేకత రాకూడదని ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందుకు తగ్గట్టే ప్రిస్కూల్ విద్యార్థుల సిలబస్‌లో మార్పులు చేస్తున్నారు. పిల్లలు తమ పాఠ్యాంశంలో భాగంగా దేశాధినేత గురించి తెలుసుకోవడానికి రోజుకు 90 నిమిషాలు కేటాయించాల్సి ఉంటుంది.
"ఉత్తరకొరియా నాయకత్వంపై విధేయత, విశ్వాసం పెంపొందించడం" అనే ఉద్దేశంతో ఈ మార్పులు చేపడుతున్నారు. ఈ మేరకు కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ ఆదేశాలు ఇచ్చారు. ఇందుకు సంబంధించి దక్షిణ కొరియా రాజధాని సియోల్ కేంద్రంగా నడిచే డెయిలీ ఎన్‌కే మీడియా సంస్థ కొన్ని విషయాలు వెల్లడించింది.
కిమ్ వంశస్థుల గురించి..
ఇప్పటి వరకు ఐదు నుంచి ఆరు సంవత్సరాలున్న ప్రిస్కూల్ విద్యార్థులకు ఉన్న సిలబస్ ప్రకారం వారు రోజుకు అర్ధగంట పాటు కిమ్ వంశస్థులు కిమ్ ఇల్ సంగ్, కిమ్ జోంగ్ ఇల్ బాల్యం గురించి తెలుసుకునేవారు. తాజా ఆదేశాల ప్రకారం వారు ఇకపై గంటన్నర సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. అందులో గంటసేపు ఈ నేతల గురించి తెలుసుకోవడంతో పాటు, మిగతా అర్ధగంట సమయంలో నేతల బాల్యం నుంచి విప్లవాత్మక సంగీతాన్ని నేర్చుకోవడానికి కేటాయించాల్సి ఉంటుంది.
కిమ్ కథలు..
ఇందులో భాగంగా కిమ్ ఐదేళ్ల వయస్సున్నప్పుడే పడవ నడిపేవారని, లక్ష్యసాధనలో నిమగ్నమయ్యేవారని, చదవడాన్ని ఇష్టపడేవారంటూ పిల్లలకు నూరిపోయనున్నారు. ప్రిస్కూల్ విద్యార్థులను మామూలుగా ఉదయం తొమ్మిది నుంచి 12 వరకు తరగతి గదిలో కూర్చోబెట్టడమే కష్టం. ఆ సమయంలో వారు వ్యాయామం, ఆడుకోవడం, కొరియన్ వర్ణమాలను నేర్చుకోవడానికి కేటాయిస్తారు. ఇప్పుడు కొత్తగా మరో గంటన్నర సమయాన్ని ఆ చిన్నారులను ఎలా కూర్చోబెట్టాలో అర్థం కాక ఉపాధ్యాయులు తలలుపట్టుకుంటున్నారు.
ఇదీ చూడండి:ఉత్తర కొరియా నాయకుడి మిస్టరీ 'అణు'మానాలు