Negotiations between Russia and Ukraine: రష్యా- ఉక్రెయిన్ మధ్య తొలి విడత చర్చలు ముగిశాయి. అయితే, ఇరు దేశాల ప్రతినిధులు మరోసారి భేటీ అయి చర్చించాలని నిర్ణయించినట్టు సమాచారం. పోలిష్-బెలారసియన్ సరిహద్దులో తదుపరి చర్చలు జరపనున్నట్టు రష్యా ప్రతినిధి బృందానికి సారథ్యం వహిస్తున్న నేత చెప్పినట్టు 'స్పుత్నిక్' వార్తా సంస్థ వెల్లడించింది. ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులు రెండో దఫా చర్చలకు ముందు సంప్రదింపులు జరుపుకొనేందుకు మాస్కో, కీవ్‌కు చేరుకున్నట్టు పేర్కొంది.
ఈయూలో సభ్యత్వ దరఖాస్తుపై జెలెన్‌స్కీ సంతకం
యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వానికి సంబంధించిన అప్లికేషన్‌పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంతకం చేశారు. ఇదో చారిత్రక క్షణమని పేర్కొంటూ ఉక్రెయిన్ పార్లమెంట్ ట్వీట్ చేసింది. ఐరోపా యూనియన్‌లో తమకు సభ్యత్వం కల్పించాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఉక్రెయిన్- రష్యాల మధ్య ముగిసిన చర్చలు
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఉక్రెయిన్- రష్యాల మధ్య శాంతి చర్చలు ముగిశాయి. బెలారస్ సరిహద్దులోని గోమెల్ వేదికగా ఇరు దేశాల ప్రతినిధుల మధ్య సుమారు నాలుగు గంటలపాటు చర్చలు కొనసాగాయి. తక్షణమే కాల్పుల విరమణ చేయాలని ఉక్రెయిన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. క్రిమియా, డాన్‌బాస్ నుంచి రష్యా సైన్యం వైదొలగాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, తమ డిమాండ్ల పరిష్కారంపై ఒప్పందం ఉండాలని రష్యా కోరుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రష్యా ప్రతీకార చర్య.. 36 దేశాల విమానాలపై నిషేధం
ప్రపంచ దేశాలు పలు రకాలుగా రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఆ దేశం వెనక్కి తగ్గడంలేదు. ఉక్రెయిన్‌పై దాడిని వ్యతిరేకిస్తూ పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధిస్తున్నప్పటికీ రష్యా దుందుడుకు ధోరణి ప్రదర్శిస్తోంది. ఈనేపథ్యంలోనే పుతిన్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా విమానాలను తమ గగనతలంలోకి రాకుండా యూరోపియన్ యూనియన్ దేశాలు నిషేధం విధించగా.. ఈ నిర్ణయంపై ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు ప్రకటించింది. 36 దేశాలకు చెందిన విమానాలను తాము నిషేధిస్తున్నట్లు రష్యా తాజాగా వెల్లడించింది. ఈ విషయాన్ని ఆ దేశ పౌర విమానయాన సంస్థ స్పష్టం చేసింది. ఈ జాబితాలో బ్రిటన్, జర్మనీ తదితర దేశాలున్నాయి. ప్రత్యేక అనుమతులు ఉంటేనే రష్యన్ గగనతలంలోకి ప్రవేశించగలవని పేర్కొంది.
ఇదీ చూడండి:
'అణ్వాయుధాలు వాడాలన్న ఆలోచనే అంగీకారం కాదు'