ఫిబ్రవరి 28 న కరోనా న్యూజిలాండ్ తలుపుతట్టింది. ఇరాన్ నుంచి వచ్చిన ఓ మహిళకు వైరస్ సోకిందని తేలింది. అధికారులను రంగంలోకి దింపారు ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్. విదేశాల నుంచి వచ్చిన వారిని నేరుగా క్వారంటైన్‌కు తరలించాల్సిందిగా నిర్ణయం తీసుకున్నారు. అంతకు కొద్ది రోజుల ముందే విదేశాల నుంచి వచ్చిన వారిని వెనువెంటనే గుర్తించాలని అధికారులను ఆదేశించారు. వారితో సన్నిహితంగా మెలిగిన వారికి పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా కరోనా జడలు విప్పకముందే.. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
అందరి మద్దతుతో..
ఎంత జాగ్రత్తగా ఉన్నా.. కరోనా తన పని తాను చేసుకుపోయింది. అవకాశం ఉన్న చోట విజృంభించడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో మరిన్ని చర్యలు తీసుకున్నారు జెసిండా. మార్చి 15 నుంచి పద్నాలుగు రోజుల పాటు ప్రజలంతా ఎవరి ఇళ్లకు వారు పరిమితం కావాలని ఆదేశించారు. ఈ గడువు ముగియకముందే మార్చి 26 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. ఆమె నిర్ణయానికి ప్రజలందరూ మద్దతు పలికారు. లాక్‌డౌన్‌ను పక్కాగా పాటిస్తున్నారు. అప్పటి నుంచి కేసుల తీవ్రత తగ్గింది. వైరస్ వ్యాప్తి ఏ దశలో ఉందో ఎప్పటికప్పుడు గుర్తిస్తూ.. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందిస్తున్నారామె. కరోనా పీడిత ప్రాంతాలను ప్రత్యేక క్లస్టర్లుగా విభజించి పరిస్థితులు చేజారకుండా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేసేలా చూస్తున్నారు.
తగ్గుముఖం పట్టిన వైరస్