తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనాను జయించిన న్యూజిలాండ్​.. యాక్టివ్​ కేసులు '0' - China reports six new imported COVID-19 cases

కరోనాను జయించిన దేశంగా న్యూజిలాండ్​ నిలిచింది. సుమారు రెండు వారాల నుంచి దేశంలో కొత్తగా ఒక్క పాజిటివ్​ కేసు కూడా నమోదు కాకపోవడం వల్ల.. వైరస్​పై విజయం సాధించినట్లే కనిపిస్తోంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు ఆ దేశ ప్రధాని జెసిండా అడర్న్‌ ప్రకటించారు. మరోవైపు దక్షిణకొరియాలో వైరస్​ కేసులు తగ్గుముఖం పట్టిన కారణంగా.. అక్కడ విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమయ్యాయి.

New Zealand's last known coronavirus case has recovered
కరోనాను జయించిన న్యూజిలాండ్

By

Published : Jun 8, 2020, 1:23 PM IST

ప్రపంచ మహమ్మారి కరోనాపై న్యూజిలాండ్​ విజయం సాధించింది. వైరస్​ సోకిన చివరి వ్యక్తి.. పూర్తిగా కోలుకొని ఇటీవలే డిశ్చార్జి అయ్యారు. ఫలితంగా ఇప్పుడు ఆ దేశంలో ఒక్క కరోనా కేసూ లేదు. న్యూజిలాండ్​లో మొత్తం 1,504 కొవిడ్​ కేసులు నమోదుకాగా.. 1,482 మంది కోలుకున్నారు. మరో 22 మంది వైరస్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా ఇప్పుడు అక్కడ ఒక్క యాక్టివ్‌ కేసు కూడా లేదని తెలిపిన అధికారులు.. గత 17 రోజులుగా ఏ ఒక్కరూ వైరస్​ బారినపడలేదని ప్రకటించారు.

అయితే విదేశాల నుంచి కొత్త కేసులు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇతర దేశాల నుంచి వచ్చేవారితో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఆంక్షల ఎత్తివేత..

ఈ రోజు అర్ధరాత్రి అన్ని ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు ఆ దేశ ప్రధాని జెసిండా అడర్న్‌ సోమవారం ప్రకటించారు. ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలు జరుగుతాయని, రిటైల్, ఆతిథ్య సేవలు కొనసాగుతాయని, ప్రజా రవాణా ప్రారంభవుతుందని ఆమె వివరించారు.

విదేశీయులపై నిషేధం విధించిన న్యూజిలాండ్​ ప్రభుత్వం.. స్వదేశీయులకు మాత్రం కొన్ని మినహాయింపులు ఇచ్చింది. సుమారు 50 లక్షల జనాభా కలిగిన ఆ దేశంలో కరోనాను కట్టడి చేయడంలో అనేక అంశాలు దోహదపడ్డాయి. దక్షిణ పసిఫిక్‌ ప్రాంతంలో న్యూజిలాండ్‌ భౌగోళికంగా ప్రత్యేకంగా ఉండడం బాగా కలిసొచ్చింది. ప్రధాని జెసిండా కఠినమైన లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేయడం కూడా కరోనాపై పోరులో విజయానికి కారణమయ్యాయి.

దక్షిణకొరియాలో అలా..

దక్షిణ కొరియాలో మరో 38 కొత్త​ కేసులు నమోదయ్యాయి. వీటిలో సియోల్​ ప్రాంతంలోనే అధికంగా ఉన్నాయి. వైరస్​ తీవ్రత తక్కువగా ఉన్న కారణంతో విద్యాసంస్థలు పునఃప్రారంభం అయ్యాయి. అయితే పాఠశాలల్లో ఎప్పటికప్పడు వైరస్​ నివారణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించింది ఆ దేశ ప్రభుత్వం.

చైనాలో మరో 6..

వైరస్​ పుట్టినిల్లు చైనాలో కొత్తగా 6 వైరస్​ కేసులు బయటపడగా.. మరో 65 మంది చికిత్స పొందుతున్నారు. ఇందులో ఇద్దరికి లక్షణాలు లేకుండా వైరస్​ సోకినట్లు గుర్తించారు. ఇప్పటివరకు ఆ దేశంలో మొత్తం 83,040 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 78,341 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. 4,634 మంది మరణించారు.

పాక్​లో లక్షకు పైగా..

పొరుగు దేశం పాకిస్థాన్​లో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. 24 గంటల వ్యవధిలో పాక్​లో 4,728 వైరస్​ కేసులు నమోదు కాగా.. బాధితుల సంఖ్య లక్ష దాటిపోయింది. మహమ్మారి బారినపడి మరో 65 మంది మృతిచెందగా.. మరణాల సంఖ్య 2,067 కు చేరింది.

ఇదీ చదవండి:అమెరికాలో తుపాను బీభత్సం.. భయం గుప్పిట్లో ప్రజలు!

ABOUT THE AUTHOR

...view details