తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనాపై న్యూజిలాండ్​ గెలుపు- రష్యా విలవిల

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం పాజిటివ్​ కేసుల సంఖ్య 59 లక్షల 30 వేలు దాటింది. మరోవైపు న్యూజిలాండ్ మాత్రం వైరస్​ను విజయవంతంగా తమ దేశం నుంచి తరిమికొట్టింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఒకే ఒక్క బాధితుడు కోలుకోగా, గత వారం రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

New Zealand near eradication, but virus has grim global hold
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి

By

Published : May 29, 2020, 6:11 PM IST

కరోనా మహమ్మారి ముప్పును 50 లక్షల జనాభా ఉన్న న్యూజిలాండ్​ విజయవంతంగా అధిగమించింది. ఆ దేశంలో ఇప్పడు ఒకే ఒక్క యాక్టివ్ కేసు ఉంది. ఆ బాధితుడు కూడా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. వారం రోజులుగా కొత్త కేసులేవీ నమోదు కాలేదు. మరోవైపు రష్యా వంటి దేశాల్లో మాత్రం వైరస్​ అంతకంతకూ విభృంభిస్తోంది. అమెరికాలో కేసుల సంఖ్య 18 లక్షలకు చేరవవుతోంది. గతవారం 21 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో లాక్​డౌన్ ఆంక్షలు సడలించనున్నట్లు అధ్యక్షుడు రోడ్రిగో తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 59 లక్షల 30 వేలు దాటింది. ఇప్పటి వరకు వైరస్​ కారణంగా 3 లక్షల 62 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి

రష్యాలో రికార్డు స్థాయిలో

రష్యాలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 234 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 8,500కుపైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4 లక్షలకు చేరువవుతోంది.

చైనాలో 5 కొత్త కేసులు..

చైనాలో కొత్తగా 5 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో వైరస్​​ లక్షణాలు కన్పించకపోయినా పాజిటివ్​గా తేలింది. ఈ తరహా కేసులు ఇప్పటి వరకు మొత్తం 409 నమోదయ్యాయి. వాటిలో 337 కేసులు కరోనాకు కేంద్రబిందువైన వుహాన్​లోనే వెలుగుచూశాయి.

దక్షిణ కొరియాలో 58 కొత్త కేసులు..

దక్షిణ కొరియాలో కొత్తగా 58 కేసులు నమోదయ్యాయి. అవన్నీ సియోల్​ మెట్రోపాలిటన్​ ప్రాంతానికి చెందినవే. ఈ నేపథ్యంలో వైరస్​ వ్యాప్తిని నియంత్రించేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు అధికారులు. దక్షిణకొరియాలో ఇప్పటి వరకు 11,402 కేసులు నమోదు కాగా, 269 మంది చనిపోయారు.

పాకిస్థాన్​లో 64 వేలకు పైగా..

పొరుగు దేశం పాకిస్థాన్​లో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 64,029కి చేరింది. కొత్తగా 2,636 కేసులు, 57 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు 1317 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నప్పటికీ లాక్​డౌన్​ను కఠినంగా అమలు చేసే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సీనియర్ మంత్రి ఒకరు చెప్పారు.

ఉద్యోగాలు పోతున్నాయ్​..

కరోనా షట్‌డౌన్ తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరిగి తెరుచుకుంటున్నప్పటికీ.. ఉద్యోగాల కోత మాత్రం ఆగడం లేదు. గత వారం దాదాపు 21 లక్షల మంది కొత్తగా నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకూ ప్రభుత్వ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య 4.1 కోట్లకు చేరింది. దీన్ని బట్టి కరోనా సంక్షోభ ప్రభావం వ్యాపారాలపై ఇంకా కొనసాగుతోందని అర్థమవుతోంది.

ఏప్రిల్‌లో నిరుద్యోగిత రేటు 14.7 శాతానికి చేరింది. మహా మాంద్యం తర్వాత ఇదే అత్యధికం. ఈ నెలలో ఇది 20 శాతం వరకు వెళ్లొచ్చని అంచనా వేస్తున్నారు.

అక్కడి లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ మరో ఆసక్తికర అంశాన్ని కూడా వెల్లడించింది. వైరస్‌ విజృంభణ తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో 2.5 కోట్ల మంది నిరుద్యోగ భృతి పొందారని.. ఇది ప్రస్తుతం 2.1 కోట్లకు చేరిందని తెలిపింది. అంటే కంపెనీలు తెరుచుకున్న తర్వాత ఉద్యోగులను తిరిగి నియమించుకుంటున్నట్లు అర్థమవుతోందని అభిప్రాయపడింది. మరోవైపు ఇప్పటి వరకు ఉద్యోగాలు కోల్పోయిన వారిలో చాలా మంది తిరిగి కంపెనీలకు రాకపోవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండంకెల నిరుద్యోగిత రేటు 2021లోనూ కొనసాగొచ్చని అంచనా వేశారు.

ABOUT THE AUTHOR

...view details