సహోద్యోగితో అనుచిత సంబంధం కలిగి ఉన్నందుకు ఇమ్మిగ్రేషన్ మంత్రిపై న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ వేటు వేశారు. ఈ విషయాన్ని స్వయంగా జసిండా ప్రకటించారు. మంత్రి ఇయాన్ లీస్ గాలోవే.. అతని కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళతో సంవత్సరం నుంచి సంబంధం కలిగి ఉన్నారని జసిండా పేర్కొన్నారు.
గాలోవే ఇదివరకు పర్యవేక్షించిన విభాగంలోనే మహిళ తొలుత ఉద్యోగం సంపాదించిందని, అనంతరం ఇప్పుడున్న కార్యాలయంలోకి మారిందని ఆర్డెర్న్ తెలిపారు. మంత్రిపై నైతికాభిప్రాయానికి వచ్చేందుకు కాస్త జాగ్రత్తపడినట్లు తెలిపారు. అయితే గాలోవే స్వయంగా ఆరోపణలపై స్పందించినట్లు తెలిపారు. అధికారాలను దుర్వినియోగం చేసినట్లు ఆయన ఒప్పుకున్నట్లు స్పష్టం చేశారు.
"మంగళవారం మధ్యాహ్నం ఈ ఆరోపణల గురించి నాకు తెలిసింది. ఈ ఆరోపణల గురించి లీస్ గాలోవేను సాయంత్రం అడిగాను. గాలోవే చర్యలు మంత్రిగా ఆయనపై నా విశ్వాసాన్ని కోల్పోయేలా చేశాయి."
-జసిండా ఆర్డెర్న్, న్యూజిలాండ్ ప్రధాని
అయితే వీరి మధ్య సంబంధం కొద్ది నెలల క్రితం ముగిసిపోయినట్లు ఆర్డెర్న్ పేర్కొన్నారు.
'క్షమించండి..!'
మరోవైపు ప్రధాని జసిండా నిర్ణయాన్ని లీస్ గాలోవే సమ్మతించారు. ఈ విషయంపై క్షమాపణలు కోరారు. సెప్టెంబర్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపారు.
"నా స్థానంలో పూర్తి అనుచితంగా వ్యవహరించాను. మంత్రిగా నేను కొనసాగలేను."